Gangs of Godavari Teaser Launch Highlights: ఆకట్టుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్ !

Gangs of Godavari Teaser Launch Highlights1 e1714232806674

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ గల యువ కథానాయకులలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకరు. కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలో విశ్వక్ సేన్, మరో విభిన్న చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన “లంకల రత్న” అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఏప్రిల్ 27న సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో జరిగిన కార్యక్రమంలో టీజర్ ను విడుదల చేశారు నిర్మాతలు.

Gangs of Godavari Teaser Launch Highlights2 Copy

ఈ సందర్భంగా కథానాయకుడు, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా మా టీమ్ అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాం. ఏడాదిలో సినిమాని పూర్తి చేసి, అద్భుతమైన అవుట్ పుట్ తో మీ ముందుకు వస్తున్నాం. టీజర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టీజర్ లో మీరు చూసింది ఒక్క శాతమే. సినిమా మీ అంచనాలకు మించేలా ఉంటుంది. ఇది నేను చాలా ఇష్టపడి చేసిన సినిమా.. అందుకేనేమో భయంతో పెద్దగా మాటలు రావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.

ఈ సినిమా తరువాత.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి తరువాత అనేలా నా కెరీర్ ఉంటుంది. ఇంత మంచి సినిమాని నాతో చేసిన నిర్మాత నాగ వంశీ గారికి నా కృతజ్ఞతలు. అలాగే వెంకట్ గారు, గోపీచంద్ గారు చిత్రీకరణ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కృష్ణ చైతన్య గురించి సినిమా విడుదలకు మాట్లాడతాను.

అందమైన కథానాయికలు నేహా శెట్టి, అంజలి గారితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. చివరిగా ఈ సినిమా గురించి ఒక్కటే చెప్తాను.. ఈసారి శివాలెత్తిపోద్ది. అలాగే మన పేరుకి న్యాయం చేసే సమయం వచ్చింది. అదే ఈ సినిమా. మే 17న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.

Gangs of Godavari Teaser Launch photos 4

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. “ఇది చాలా రోజుల తర్వాత విశ్వక్ నటించిన పక్కా మాస్ సినిమా. ఈ మూవీ ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది మొదటి షో కి తెలిసిపోతుంది. ఈ ఎన్నికల హడావుడి ముగిశాక ట్రైలర్ ను విడుదల చేసి ప్రమోషన్స్ జోరు పెంచుతాం. టిల్లు స్క్వేర్ స్థాయిలో బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాం.” అన్నారు.

Gangs of Godavari Teaser Launch Highlights4

కథానాయిక నేహా శెట్టి మాట్లాడుతూ.. “ఇప్పటినుంచి నేను రాధికను కాదు.. బుజ్జి. మీ అందరికీ టీజర్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. టీజర్ లో మీకు కొంచెం చూపించాము. సినిమాలో దీనికి వంద రెట్లు ఉంటుంది. మీ అందరికీ ఈ సినిమా చాలా నచ్చుతుంది.” అన్నారు.

Gangs of Godavari Teaser Launch Highlights3 Copy

ప్రముఖ నటి అంజలి మాట్లాడుతూ.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది నా కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. నేను రత్నమాల అనే అద్భుతమైన పాత్ర పోషించాను. ఈ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. దర్శకుడు కృష్ణ చైతన్య గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత నాగవంశీ గారికి కృతజ్ఞతలు. విశ్వక్ సేన్, నేహా శెట్టితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను.” అన్నారు.

Gangs of Godavari Teaser Launch photos 5

చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. “టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. సినిమా కూడా ఖచ్చితంగా బాగుంటుందని హామీ ఇస్తున్నాను. విశ్వక్ విశ్వరూపం చూస్తారు. నేహా శెట్టి, అంజలి గారి పాత్రలు కూడా చాలా బాగుంటాయి.” అన్నారు.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్ ఆకట్టుకుంటోంది. సినిమాలోని పాత్రకి తగ్గట్టుగా ఆహార్యం మార్చుకునే అలవాటున్న విశ్వక్ సేన్, “లంకల రత్న” పాత్ర కోసం తనని తాను మలుచుకున్న తీరు కట్టిపడేస్తోంది. ఆ పాత్ర కోసం ఆయన పడిన కష్టం తెరమీద కనిపిస్తోంది. తాను ఇప్పటివరకు పోషించిన పాత్రలను మైమరపింప చేసేలా, “లంకల రత్న” పాత్రలో విశ్వక్ సేన్ ఒదిగిపోయారు.

టీజర్‌లోని ప్రతి షాట్ “లంకల రత్న” పాత్ర తీరుని ప్రతిబింబించేలా ఉంది. లైటింగ్, నీడలు, చీకటి, కథానాయకుడి బాడీ లాంగ్వేజ్‌ ద్వారా ఆ పాత్ర గురించి చెప్పడానికి ప్రయత్నించిన తీరు అమోఘం. టీజర్ లో ఆ పాత్ర గురించి, అక్కడి ప్రాంతం గురించి రాసిన సంభాషణలు.. ఈ చిత్రం యొక్క చీకటి ప్రపంచాన్ని మనకు పరిచయం చేశాయి.

ఈ చిత్రంలో గోదావరి యాసలో మాట్లాడటంపై విశ్వక్ సేన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా “అమ్మోరు పూనేసిందిరా.. ఈ రాత్రికి ఒక్కోడికి శివాలెత్తిపోద్ది అంతే.”, “నేను మంచోడినో చెడ్డోడినో నాకు తెలియదు.. కానీ మంచోడిని అన్న చెడ్డ పేరొద్దు” వంటి సంభాషణలు విశ్వక్ సేన్ పోషించిన పాత్ర తీరుతో పాటు, యాసపై ఆయనకున్న పట్టుని తెలియచేస్తున్నాయి.

సొంత మనుషుల నుంచే అవరోధాలను ఎదుర్కొంటూ, చీకటి సామ్రాజ్యంలో ఒక సాధారణ వ్యక్తి, అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు అనేది ఈ చిత్రంలో చూడబోతున్నాం. చిత్ర కథను, కథానాయకుడి పాత్రను టీజర్ లో అద్భుతంగా చూపించి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచారు.

దర్శకుడు కృష్ణ చైతన్య రచనకు, అనిత్ మధాడి కెమెరా పనితనం తోడై.. ఈ టీజర్‌ను మరింత ప్రత్యేకం చేశాయి. ఇక యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం కూడా టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. మొత్తానికి టీజర్ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది.

Gangs of Godavari Teaser Launch Highlights

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘సుట్టంలా సూసి’ పాట యూట్యూబ్‌లో 30 మిలియన్లకు పైగా వీక్షణలతో వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది అనడంలో సందేహం లేదు.

యువ అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో, ప్రముఖ నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం మే 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *