అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.
విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో నేడు సినిమా దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్ మా 18F మూవీస్ మీడియా ప్రతినిథితో ముచ్చటించి మీడియా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానాలు తెలిపారు.
మీ గురించి, మీ నేపథ్యం చెప్పండి?
నా పేరు శివ సాయి వర్ధన్. మాది నెల్లూరు. సినిమాల్లోకి రావాలని ఇంజనీరింగ్ అప్పుడు ఫిక్స్ అయ్యాను. ఫైనాన్షియల్ సమస్యల వల్ల ఐటి జాబ్ చేశాను మొదట. ఐటి జాబ్ చేస్తూ 2016లో గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ చేశాను. అది మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత పెళ్లిగోల సిరీస్ రెండు సీజన్స్ చేశాను. ఆ తర్వాత ఆహాలో గీత సుబ్రహ్మణ్యం సిరీస్ రెండు సీజన్స్ చేశాను. ఆ తర్వాత నిహారిక గారు పిలిచి హలో వరల్డ్ ఇచ్చారు. ఇవన్నీ ఐటి జాబ్ చేస్తూనే చేశాను.
2020 లో జాబ్ మానేసి ఫుల్ గా ఫోకస్ పెడదాం అనుకున్నాను. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. అప్పుడు మా ఆవిడ జాబ్ చేస్తూ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో భలే ఉన్నాడే సినిమా చేసాను మారుతీ గారి సపోర్ట్ తోనే. కానీ పలు కారణాలతో ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత మారుతి గారే పిలిచి ఈ సినిమా ఇచ్చారు.
ఈ కథ ఎవరు రాశారు? మీ దగ్గరకు ఎలా వచ్చింది?
ఈ కథ మారుతీ గారు పిలిచి నాకు ఇచ్చారు. దీన్ని సుబ్రహ్మణ్యం గారు అనే జర్నలిస్ట్ రాసారు. ఆయనే డైరెక్ట్ చేయాలి కానీ వేరే వాళ్లకు ఇమ్మనడంతో జీ వాళ్ళు నన్ను ప్రపోజ్ చేశారు నా వర్క్ నచ్చి. మొదటిసారి నేను వేరే వాళ్ళ కథకు పనిచేసాను. దాంతో నేను వారం రోజులు కథని అర్ధం చేసుకున్నాను.
మీ పాత సిరీస్ లలో క్యూట్ రొమాన్స్ సీన్స్ ఉంటాయి, ఇందులో అలాంటివి ఉంటాయా?
నేను చాలా ట్రై చేస్తాను అదొక్కటే అని కాకుండా. దీంట్లో కూడా రిలేటిబులిటీ ఎక్కువ ఉంటుంది. హీరో – హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది గీతా సుబ్రహ్మణ్యం లాగే. సినిమాలో ఒక మంచి డ్రామా నడుస్తుంది. బోర్ కొట్టదు. నిన్న ఈవెంట్లో మాట్లాడిన వాళ్లంతా సినిమా చూసి అంతా బాగా మాట్లాడారు.
ఇందులో అన్ని పాత్రలకు రిలేట్ అవుతాము. హీరోయిన్ ని చూస్తే పక్కింటి అమ్మాయి అనిపిస్తుంది. మొదట వేరే అమ్మాయి అనుకున్నాం కానీ ఆమె హీరోయిన్ లాగా కనిపిస్తుంది పక్కింటి అమ్మాయిలా లేదని మార్చేసాము.
అంకిత్ ఛాయిస్ ఎవరిది? అతను సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు?
ఈ కథలోకి అంకిత్ ముందే వచ్చాడు. నాకు ముందే అంకిత్ పరిచయం ఉన్నాడు. నిహారిక గారికి హలో వరల్డ్ చేసేటప్పుడు అంకిత్ కి కూడా ఒక పాత్ర అనుకున్నాను కానీ అతనికి కుదరలేదు. ఒక అంకిత్ తప్ప ఈ సినిమాలో అందర్నీ నేనే సెలెక్ట్ చేసుకున్నాను.
అంకిత్ నాతో బాగా ట్రావెల్ అయ్యాడు. రియాల్టీగా నటించాడు. ఒక షాట్ లో కింద పడితే నిజంగానే పడాలి, ఎలాంటి సేఫ్టీ లేకుండానే నిజంగానే పడ్డాడు. అంకిత్ సినిమాని తన భుజాల మీద మోస్తున్నాడు.
ఒక లైన్ లో ఈ సినిమా కథ చెప్పాలంటే ఏం చెప్తారు?
ఒక మధ్య తరగతి అమ్మాయి గురించి చెప్పాలి. ఇప్పుడు అందరూ మన జీవితం కాకుండా పక్కనోళ్ళ జీవితం చూసి కంపారిజన్ చేసుకుంటున్నారు. మా అమ్మాయి కూడా వాళ్ళు కొంటున్నారు నాకు కావాలి అని కంపేర్ చేస్తుంది. ఇందులో హీరోయిన్ కూడా టీనేజర్స్ లాగా పక్కనోళ్ళతో కంపేర్ చేసుకొని తన కుటుంబ స్థితి మర్చిపోయి అది కావాలి ఇది కావాలి అంటారు. మనం స్థితికి మించి వాళ్ళని చదివిస్తాం అయినా వాళ్ళు పక్కనోళ్ళతో కంపేర్ చేసుకుంటారు.
మనం ఎంత చేసినా చిన్న లోటు కనిపిస్తే దాన్ని హైలెట్ చేస్తారు పిల్లలు. అదే కథాంశంతో ఉంటుంది. ఇప్పుడు అందరూ నేను ఎంజాయ్ చేయలేదు, నా పిల్లలు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇది ఇంకా తప్పు. ఈ సినిమాలో నాన్న క్యాబ్ డ్రైవర్ అయినా ఆయన స్థితి మించి చేస్తున్నా కూతురికి తెలీదు. ఇందులో క్లాస్ లు పీకడాలు ఏమి లేవు. ఒక జీవితం చూపిస్తాను. ఈ కథలో జీవితం చూపిస్తున్నాం అందుకే నేను కనెక్ట్ అయ్యాను.
మీరు భలే ఉన్నాడే సినిమా అయ్యాక బాధపడ్డారు అని మారుతీ గారు అన్నారు. సినిమా రిజల్ట్ ని ఎలా తీసుకుంటారు?
నేను కొంచెం ఎమోషనల్. నాకు ఆ సినిమా ప్రివ్యూ దగ్గరే అర్థమైంది సెకండ్ హాఫ్ వర్కౌట్ అవ్వలేదని. ముందే తెలిసింది భలే ఉన్నాడే సినిమా గురించి. అది ఫెయిల్ అయ్యాక ఒక గంట సేపు బాత్రూంలో కూర్చొని ఏడిచాను. తర్వాత అక్కడితో వదిలేసి మూవ్ అయ్యాను. ఆ సినిమాకు కొన్ని వర్కౌట్ అవ్వలేదు.
ఈ సినిమాలో లవ్ కాకుండా థ్రిల్లింగ్ కూడా ఉందనిపిస్తుంది ?
ఈ సినిమాలో లవ్ స్టోరీ మాత్రమే కాదు థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఒక కపుల్ ఏమి లేకుండా బయటకు వచ్చేస్తే వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు అని చూపించాను.
బేబీ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దీనికి చేసాడు. ఎలా ఇచ్చారు మ్యూజిక్?
మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ కుమ్మేసాడు. ప్రెట్టీ సాంగ్ ముందే ఉంది. మిగిలిన సాంగ్స్ అన్ని నేను వచ్చాకే రాసారు. బ్యాక్ గ్రౌండ్ మీరు సినిమా చూడండి నచ్చేస్తుంది. నేను కొన్ని మార్చమని చెప్పాను కానీ ఆయన నన్ను నమ్ము అన్నారు. ఫైనల్ చూస్తే అదిరిపోయింది.
మారుతీ గారు ఏమన్నా ఛేంజెస్ చెప్పారా సినిమా చూశాక?
ఇటీవల సినిమా నిడివి విషయంలో ఎక్కువ డిస్కషన్ చేస్తున్నారు. మారుతీ గారు సినిమా చూసి ఒక 5 నిముషాలు కట్ చేస్తే బాగుండు అని అన్నారు. ఆయన చెప్పాక నేను కూడా చూసి ఒక ఏడు నిమిషాల వరకు కట్ చేశాను.
టైటిల్ బ్యూటీ అని ఎందుకు పెట్టారు?
ఈ సినిమాలో హీరోయిన్ ఇన్నర్ బ్యూటీ కంటే ఔటర్ బ్యూటీ కి ఎక్కువ విలువ ఇస్తుంది. అది కాదు ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెంట్ అని చెప్పడానికి. బ్లాక్, వైట్ అంటూ ఏమి ఉండదు ఇన్నర్ బ్యూటీ ఉండాలి.
చిన్న సినిమా కాబట్టి బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయా?
బడ్జెట్ లిమిట్ ఉంటేనే బాగుంటుంది. లిమిట్ బడ్జెట్ ఇవ్వకపోతే డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. కానీ అవసరం అయితే ఇస్తారు. ఈ సినిమాలో ఒక షిప్ సీన్ ఉంది. అది కావాలి అని మారుతీ గారికి చెప్పాను. ఎందుకు అని అడిగితే ఆయన్ని కన్విన్స్ చేయాలి, చేశాను. వాళ్ళు ఒప్పుకుంటే బడ్జెట్ ఇస్తారు.
అంకిత్ నిన్న ఈవెంట్లో సినిమా నచ్చకపోతే జీరో రేటింగ్ ఇవ్వండి అన్నాడు. ఏంటి అంత కాన్ఫిడెన్స్?
గట్స్. అనుకోకుండా చెప్పలేదు. సినిమా బాగుంది అందుకే కాన్ఫిడెంట్ తో చెప్పాడు. నిజంగా జీరో రేటింగ్ ఇచ్చినా మేము తీసుకుంటాం కానీ ఇవ్వరు. ఈ నెలలో వచ్చిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. వాటికి డబ్బులు పెట్టిన ప్రేక్షకులు మా సినిమాకు కూడా డబ్బులు పెట్టాలి అంటే మంచి సినిమానే ఇవ్వాలి. ఇస్తున్నాం.
నరేష్ – వాసుకి గారి గురించి చెప్పండి?
వాళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్. వాళ్ళు సెట్ లో మంచి ఎనర్జీ ఇస్తారు. వాసుకి గారు సపోర్ట్ చేసారు చాలా. అందుకే నా ఛాయస్ కరెక్ట్. మొదట వాసుకి గారు నరేష్ గారికి వైఫ్ అంటే ఎవరూ ఒప్పుకోలేదు. ఇటీవల సుందరకాండ సినిమాలో నరేష్ గారికి కూతురిగా వాసుకి గారు నటించారు. ఇందులో భార్యగా చేశారు. సినిమా చూశాక సెట్ అవ్వలేదు అనిపించదు. పర్ఫెక్ట్ గా ఎమోషన్ ని పండించారు.
సినిమా చూసిన వాళ్ళు ఏం అన్నారు?
అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మారుతీ గారికి బాగా నచ్చింది కాబట్టే ఆయన నిన్న ఈవెంట్లో అంత బాగా మాట్లాడారు. ఒక డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ హాఫ్ అయ్యాక బానే ఉంది అన్నారు. సెకండ్ హాఫ్ అయ్యాక ఏడుస్తూ బయటకి వచ్చారు. నేను సాధించాను అనిపించింది. కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ చూసారు. సినిమా వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చూసి చెప్పాలి. మన వాళ్ళు చూస్తే సినిమా బాగుంది అనే అంటారు. ముందే ప్రీమియర్స్ వేస్తాము.
నెక్స్ట్ కథలు ఏంటి? సిరీస్ లు మళ్ళీ చేస్తారా?
మట్టి వాసన కథలు చెప్పాలి. ఒక మార్షల్ ఆర్ట్స్ కథ రాసుకున్నా. దాని గురించి ట్రైనింగ్ నేర్చుకున్నా. మనలోంచి కథలు రావాలి. అలాంటి కథలే రాస్తాను. జనాల్ని గమనించి రాసుకుంటాను. నాకు యాక్షన్ కూడా ఇష్టమే. సిరీస్ లు కూడా చేస్తాను.
బతకడానికి డబ్బులు కావాలి. డబ్బుల కోసం చేస్తాను. గీత సుబ్రహ్మణ్యం, పెళ్లిగోల సీక్వెల్స్ కి పిలిస్తే వెళ్తాను. అమెజాన్ తో ఒకటి డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ఒకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ వర్ధన్ గారు,
*కృష్ణ ప్రగడ.