తెలుగు సినీ పరిశ్రమలో రచయితగా, డైరెక్టర్ గా అతనిది ఒక విభిన్నమైన శైలి. సినీ పరిశ్రమలోకి అక్షరాలతో అడుగు పెట్టి ఆపై ఆ తన అక్షరాలకు తానే దృశ్యరూపం కల్పించేందుకు మెగా ఫోన్ పట్టి సిల్వర్ స్క్రీన్ మీద ప్రేక్షకులు మెచ్చే సెల్యులాయిడ్స్ అందించాడు.
ఆయన సినిమాల్లో డైలాగ్స్ గన్ లోని బులెట్స్ లా చాలా షార్ట్ గా ఉంటాయి. కానీ ఆయన సినిమాలోని హీరో మాత్రం పెను తుపాన్ తలోంచి చూసే నిప్పుకణంలా.. ఆరడుగుల బుల్లెట్ ధైర్యం విసిరిన రాకెట్ లా.. వ్యాలుస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు.. తెలివైనోడు కూడా.. ఎందుకంటే పట్టుకోవడం గొప్పా.. వదిలేయటం గొప్పా.. అనే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు హీరో ఎటువైపు మొగ్గు చూపుతాడు అనే క్యూరియాసిటిని ప్రేక్షకుల్లో కలిగించిన వాడు.
అతని సినిమాల్లోని సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎందుకంటే వాటిలో లోతైన పరమార్థం దాగుంటుంది కాబట్టి. ఆయన మరెవరో కాదు మాటలతో గారడి చేసే మాంత్రికుడు.. సిల్వర్ స్క్రీన్ మీద సెల్యులాయిడ్ తీసే తాంత్రికుడు.. త్రివిక్రమ్.. త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఈ రోజు రాత తీత మోత లో బ్యాలెన్స్ తెలిసినవాడు కాబట్టే ఆయన త్రివిక్రముడు అయ్యాడు. ఆయన అభిమానులకు గురూజీ కాగలిగాడు. ఈ రోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు. రచయిత నుంచి దర్శకుడిగా ఎదిగిన ఆయన సినీ ప్రయాణం మీద ఓ లుక్కేద్దాం..
త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్ శర్మ. త్రివిక్రమ్ 1972, నవంబర్ 7న ఆకెళ్ల ఉదయ్ భాస్కర్, ఆకెళ్ల నరసమ్మ. దంపతులకి పుట్టాడు.
హాస్య నటుడు ఎం.ఎస్ నారయణ త్రివిక్రమ్ సినిమాల్లోకి రాకముందు నుంచే పరిచయం. అలాగే సునీల్ కూడా ఎందుకంటే త్రివిక్రమ్ సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. వారి ముగ్గురిది ఓకే ప్రాంతం కాబట్టి. ఎం.ఎస్ ఊరు వచ్చిన సందర్భాల్లో రిసీవ్ చేసుకోవడానికీ తాను, సునీల్ రైల్వే స్టేషన్ కి తరచూ వెళ్ళేవారు. ఈ విషయాన్ని ఎం.ఎస్ తన ఆత్మకథ లో ప్రస్తావించాడు.
త్రివిక్రమ్ ఆంధ్రా యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. అంతేకాదు కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసాడు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో తన స్నేహితుడు సునీల్ తో కలిసి త్రివిక్రమ్ ఒకే గదిలో ఉండేవాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 సం”లో ‘స్వయంవరం’ సినిమా ద్వారా మాటల రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రచయితగా కంటిన్యూ అవుతూ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఇవే..
`స్వయంవరం’`, `నువ్వేకావాలి`, `చిరునవ్వుతో`, `నిన్నే ప్రేమిస్తా`, `నువ్వు నాకు నచ్చావ్`, `వాసు`, `నువ్వే నువ్వే`, `మన్మథుడు`, `మళ్లీశ్వరీ`, `జై చిరంజీవ`,`తీన్ మార్`, `ఛల్ మోహన్‌రంగ`
ఆయా సినిమాల్లోని త్రివిక్రమ్ రాసిన మాటలు కొత్త అందాన్ని ఇచ్చాయి. అంతేకాదు వీటిలో చాలా సినిమాలు త్రివిక్రమ్ మాటలవల్లే విజయం అందుకున్నాయంటే అది ఏ మాత్రం కూడా అతిశయోక్తి కాదు.
నువ్వే నువ్వే:
త్రివిక్రమ్ డైరెక్టర్ గా తన మొదటి సినిమా ‘నువ్వే నువ్వే’తో మంచి విజయం అందుకున్నాడు. అమ్మ ఆవకాయ్ అంజలి ఎప్పటికి బోర్ కొట్టవు. అలాగే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఎన్ని సార్లు చూసిన కూడా బోర్ కొట్టదు. ఈ సినిమాలోని మాటలు ఎప్పుడు చూసినా మనల్ని హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.
‘అతడు:
దర్శకుడిగా తన రెండో సినిమా ‘అతడు’. అప్పటివరకూ మహేష్ బాబు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఈ సినిమా ఒకెత్తు.. కానీ అసలు విషయం ఏమిటంటే రచయితగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతోనే డైరెక్టర్ గా ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు. అందులో భాగంగానే ఈ కథను ముందుగా పవన్ కళ్యాణ్ కి వెళ్లి చెప్పగా అయన కథ వింటూ నిద్రపోయారట.
ఆ తర్వాత ఇదే కథని మహేష్ బాబుకి చెబితే మహేశ్ కి బాగా నచ్చీ కార్యరూపం దాల్చింది. ఈ సినిమాకి ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డులను అందుకున్నారు. వెండితెర పై అంతగా సంచలనం సృష్టించని ‘అతడు’ బుల్లితెర పై మాత్రం ప్రభంజనం సృష్టించింది.
‘జల్సా: ఆయన మూడవ సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలయికలో వచ్చిన ‘జల్సా’. పవన్ కళ్యాణ్ అభిమానులు నిజంగానే జల్సా చేసుకునేలా చేసిన సినిమా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ సమయంలో వరస ప్లాపుల్లో ఉన్నాడు.
అలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది జల్సా. ఇక ఎక్కడ చూసిన విన్నా కూడా దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు..
ఏ సరిగమ పదనిస కరో కరో జల్సా అంటూ మార్కెట్లో మారుమోగాయి. . సినిమాలో త్రివిక్రమ్ కామెడీతో పాటు ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. విలన్‌ను రక్తపు చుక్క రాకుండా.. ఒక్కసారి కూడా ఆయన్ని కొట్టకుండా అంతమొందించే క్లైమాక్స్ కూడా అద్భుతమే.
యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగా వర్కవుట్ అయింది.
‘ఖలేజా: నాల్గవ సినిమాగా మళ్ళీ మహేష్ తోనే..
అదే ‘ఖలేజా’ మహేశ్ బాబులోని కామెడీ యాంగిల్‌ను చూపించిన సినిమా అది. దైవం మనుష్య రూపేన అన్న కాన్సెప్ట్ తో దేవుడు ఎక్కడో లేడు, నిస్వార్థంగా సహాయం చేయాలనుకునే మనిషిలోనే ఉంటాడనే యూనిక్ స్టోరీ లైన్‌తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన సినిమా ఇది.
ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది కానీ సూపర్ హిట్టుగా నిలువలేదు. కానీ టీవీల్లో మాత్రం ఈ సినిమా చూసి అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ ఫీల్ అవుతుంటారు ఆడియన్స్.
‘జులాయి’: అల్లు అర్జున్ తో ఐదవ సినిమా అదే ‘జులాయి’
బరువు, బాధ్యతలు తెలిసి తెలియని ఒక మధ్య తరగతి కుర్రాడి కథే ఈ సినిమా కథాంశం. జీవితంలో రాత్రికి రాత్రే వృద్ధిలోకి రావాలి అనే మనస్తత్వం ఉన్న కుర్రాడికి అతని కుటుంబానికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి చివరికి ఏ మార్గాన్ని ఎన్నుకున్నాడు అని యూత్ కి మాంచి మెసేజ్ ని.
డ్రగ్ ఇంజెక్ట్ చేసినట్లు చేశాడు దర్శకుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ డిజైన్ చేసిన బన్నీ క్యారెక్టరైజేషన్.. సోనూ సూద్ విలనిజం.. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ జులాయి సినిమాకు ప్రాణం పోశాయి.
అత్తారింటికి దారేది: పవన్ తో ఈ సారి జల్సా కాదు ఎంటర్టైన్మెంట్ అంతకుమించి అనేలా వచ్చిన ‘అత్తారింటికి దారేది!’
జల్సా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా ‘అత్తారింటికి దారేది’. గబ్బర్ సింగ్‌తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పవన్ మళ్ళీ తన సినిమాను తానే బ్రేక్ చేసాడు. గబ్బర్ సింగ్ రికార్డ్స్‌ని తిరగరాసింది అత్తారింటికి దారేది. సగం సినిమా మొత్తం పైరసీ అయినా కూడా టాలీవుడ్‌లో అప్పటివరకు ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేసింది అనేకంటే కూడా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసి మార్కెట్లో పవన్ కళ్యాణ్ స్టామినా చూపిన సినిమా ఇది.
ఇక క్లైమాక్స్‌లో వచ్చే రైల్వే స్టేషన్ సీన్‌తో సినిమా చూస్తున్నవాళ్లందరినీ కంటతడి పెట్టించేశాడు పవన్ కళ్యాణ్. ఆ సీన్ ఇప్పటికి, ఎప్పటికి కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి. అత్త అంటే అమ్మ తరువాత మళ్ళీ అమ్మ అని ఆ సినిమాలో ఇచ్చిన మెసేజ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
ఈ సినిమా రికార్డ్ బాహుబలి వచ్చేవరకు కూడా అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ ఆ సినిమా పేరుతోనే ఉండేది.
సన్ ఆఫ్ సత్యమూర్తి’:
ఈ సారి అల్లు అర్జున్ ను జులాయిగా కాదు విలువలే ఆస్తిగా భావించే ఉన్నతమైన యువకుడి పాత్ర అది. అదే ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’.
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’. చనిపోయిన తర్వాత కూడా నాన్న గౌరవాన్ని కాపాడే కొడుకు కథ ఇది. తండ్రి కోసం కొడుకు పడే ఆరాటాన్ని ఈ చిత్రంలో చాలా బాగా చూపించాడు త్రివిక్రమ్. అలాగే సినిమాలో నాన్న గురించి మాటలు కూడా చాలా అద్బుతంగా ఉంటాయి.
నాన్న అంటే మరిచిపోలేని ఓ జ్ఞాపకం అంటూ మంచి మాటలు రాసాడు మాటల మాంత్రికుడు. ఈ చిత్రం విజయంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ ఫాదర్ సెంటిమెంట్ సినిమాల్లో సన్నాఫ్ సత్యమూర్తి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే.
‘అ.. ఆ..!’
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం మన సున్నితమైన, అత్యంత విలువైన కుటుంబ విలువలు, బంధాలు మరిచిపోయే తరుణంలో వాటి విలువను వెండితెర మీద హాస్యంగా చెప్తూనే ఎంతో హృద్యంగా మలిచిన సినిమానే ‘అ.. ఆ..!’ పక్క పక్కనే ఉండే అక్షరాలు కలుసుకోవడానికి పాతికేళ్ళు పట్టింది అంటూ వచ్చిన ఈ సినిమా.
సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కాంబోలో వచ్చిన నవల కథా చిత్రం ‘మీనా’ నుంచి తీసుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. నితిన్, సమంత కాంబోలో వచ్చిన అందమైన చిత్రం ‘అ..ఆ..!’. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంగా నిలిచింది.
‘అజ్ఞాతవాసి’: మూడో సారి పవన్ తో..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో త్రివిక్రమ్ చేసిన మూడో చిత్రం ‘అజ్ఞాతవాసి’. అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఈ సినిమా త్రివిక్రమ్ కెరీర్ లోనే అజ్ఞాత చిత్రంగా నిలిచింది..
త్రివిక్రమ్ కెరీర్ లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయినా కూడా సినిమాలోని సంభాషణలు, అనిరుధ్ అంచిన పాటలు ప్రేక్షకులను అలరించాయని చెప్పొచ్చు. ఎంత అలరించిన బాక్సాఫీస్ వద్ద ఆడని సినిమాగా నిలిచిపోయింది.
అరవింద సమేత వీరరాఘవ:
ఊహకందని తారక రాముడు వీర రాఘవుడు అయితే..! ఎలా ఉంటుంది అదే ‘అరవింద సమేత వీరరాఘవ’.
త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసిన సినిమా ఇది. అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలు అంటే ఒకరిని ఒకరు నరుక్కోడమే సీమ పౌరుషం అనే కథాంశంతో వచ్చిన సినిమాలకి పూర్తి విభిన్నంగా నిలిచింది ఈ సినిమా. శత్రువు చేతికి ఒక ప్రాణం నిలుస్తుంది అంటే ఆ శత్రువు కాలు పట్టుకునేందుకు కూడా వెనుకాడని ఉన్నతమైన హీరో పాత్ర అది.
ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇందులో రాయలసీమ యాసలో మాట్లాడిన తారక్ సూపర్బ్ అనిపించాడు. జగపతి బాబు విలనిజం ఈ సినిమాకి మరో బలం. ముఖ్యంగా ఎన్టీఆర్, జగపతి బాబుల మధ్య వచ్చే సీన్స్ రోమాంచితమైనవి. క్లైమాక్స్ లో ఇద్దరి నటన అమోఘం.
అల వైకుంఠపురం లో..’:
అల్లు అర్జున్ నేషనల్ స్టార్ గా గుర్తింపు వచ్చేలా చేసిన సినిమా ‘అల వైకుంఠపురం లో..’
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద హిట్టోమాటల్లో చెప్పలేనిది ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు సంచలనం. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కే చెందుతుంది.
ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ పూటకో రికార్డును మటాష్ చేస్తూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ పాట 546 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. మరోవైపు రాములో రాములో పాట 307 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక సామజవరగమన ఫుల్ వీడియో సాంగ్ కూడా 166 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన 100 వీడియో సాంగ్స్‌లో బుట్టబొమ్మ 15వ స్థానంలో నిలిచింది. తాజాగా 2020లో విడుదలైన టాప్ సాంగ్స్‌లో ‘అల వైకుంఠపురములో’ సాంగ్స్ యూట్యూబ్‌లో సెన్సెషన్ క్రియేట్ చేసిన టాప్ 10లో చోటు దక్కించుకుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తమన్ స్వరపరిచిన పాటలకు అల్లు అర్జున్, పూజా హెగ్డే డ్యాన్స్ మూమెంట్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ‘బుట్ట బొమ్మ’ సాంగ్ దేశ వ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది.
మరోవైపు ఇదే సినిమాలోని ‘రాములో రాములో’ పాట ఎనిమిదవ స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాదు 2020లో ఇండియా టాప్ 10 సాంగ్స్ లిస్టులో ఉన్న ఏకైక తెలుగు చిత్రం కూడా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ కావడం విశేషం.
మళ్ళీ పవన్ కోసం పెన్ను పట్టిన త్రివిక్రమ్:
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలయికలో దర్శకుడు సాగర్ చంద్ర తెలుగులో తీసిన సినిమా భీమ్లా నాయక్. దీని ఒరిజినల్ మలయాళంలో వచ్చిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కి తెలుగు రీమేక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.
ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన సంభాషణలు ప్రేక్షకులను మెప్పించిన సినిమా ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి.
త్రివిక్రమ్ సినిమాల్లో డైలాగ్స్ పేరాలకి పేరాలు ఉండాల్సిన పనిలేదు. ఎందుకంటే అవి స్వీట్ అండ్ షార్ట్ షార్ప్ పంచెస్ కాబట్టి. ఆ డైలాగ్స్ అండ్ పంచెస్ ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యేలా చేశాయి. సో ఆవిధంగా ప్రేక్షకులను మెప్పించడానికి ఒక్క పంచ్ డైలాగ్ చాలని నిరూపించాడు. ఆయన సినిమాలో ప్రేమికుడు ఎలా ఉండాలో ప్రేమగా చెప్తాడు.
ఓ కొడుకు తండ్రి విలువలు కాపాడాల్సిన అవసరం ఏంటో తెలియ చెప్తాడు. అంతేకాదు సమాజంలో సైంటిస్ట్‌ల కన్నా బాబాలు ఎక్కువుగా ఫేమస్ అంటూ సున్నితంగానే విమర్శిస్తాడు. అలా తెలుగు సినీ ప్రేక్షకులను నవ్వించి, కవ్వించి, వెక్కిరించి, ఏడిపించి మెప్పించిన డైలాగ్స్ ను ఒక సారి గుర్తు చేసుకుందాం..
- సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
- జీవితం ఎలాంటిది అంటే.. ఇంట్రస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు.. ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రస్ట్ ఉండదు..
- కూతురిని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపి కన్నీళ్లు పెట్టుకోవటం కాదు.. మోసపోయి కన్నవాళ్ల దగ్గరకి వస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
- అందరూ యుద్ధంలో గెలవడం, ఓడడం చూస్తారు .. అంతా అయిపోయాక ఏడవడం ఎవరికీ జ్ఞాపకం రాదు.
- నిజం చెప్పక పోవడం అబద్దం.. కానీ అదే అబద్దాన్ని నిజం చేయాలనుకోవడం మోసం..
- యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం.
- యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు.
- ప్రేమంటే తేలికగా మర్చిపోయే సంఘటన కాదు, బ్రతికినంత కాలం గుర్తించుకోవాల్సిన జ్ఞాపకం.
- వయసు అయిపోయిన హీరోలందరూ రాజకీయ నాయకులు అయిపోయినట్లు, ఫెయిల్ అయిన హీరోలందరూ ఫ్రెండ్స్ కాలేరు.
- మనం బాగున్నపుడు లెక్కలు మాట్లాడి..
కష్టాల్లో ఉన్నపుడు విలువలు మాట్లాడకూడదు.. - అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు..
జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం ఉండదూ.. - పని చేసి జీతం అడగొచ్చు, అప్పు చేసి వడ్డీ అడగొచ్చు, కానీ హెల్ప్ చేసి థాంక్స్ అడగకూడదు.
- కూతుర్ని కంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, మోసపోయి కన్నవాళ్ళ దగ్గరకొస్తే కన్నీళ్లు తుడవడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
- తండ్రికి, భవిష్యత్తుకి భయపడనివాడు జీవితంలో పైకి రాడు.
- అందంగా ఉండటం అంటే మనకు నచ్చినట్టు ఉండడం కానీ ఎదుటివారికి నచ్చేలా ఉండటం కాదు.
- బాగుండడం అంటే బాగా ఉండటం కాదు నలుగురితో ఉండడం నవ్వుతూ ఉండడం.
- మనుషులు పుట్టాకే సంప్రదాయాలు పుట్టాయి, సంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు.
- మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వారు, మనం * ఓడిపోయినప్పుడు భుజం తట్టేవారు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా…ఎంత పొగొట్టుకున్నా తేడా ఉండదు.
- గుడిలో దేవుడిని, కన్న తల్లితండ్రులను మనమే వెళ్లి చూడాలి, వాళ్ళు మన దగ్గరకు రావాలనుకోవడం మూర్ఖత్వం.
- అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, కానీ దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుంది.
- నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.
- వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు, అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు.
- ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుని కూడా క్షమించగలగాలి.
- మన దేశంలో లాజిక్ లు కన్నా మ్యాజిక్ లే ఎక్కువ ఇష్టం, అందుకే ఇక్కడ సైంటిస్ట్ లు కన్నా బాబాలు ఫేమస్.
- మనకు వస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్లకు వస్తే నరకం.
- బాధలో ఉన్నవాడిని ఎలా ఉన్నావని అడగడం అమాయకత్వం.. బాగున్నవాడిని ఎలా ఉన్నావని అడగడం మూర్ఖత్వం.
- మనకు వస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్లకు వస్తే నరకం.
- కారణం లేని కోపం..
ఇష్టం లేని గౌరవం..
బాధ్యత లేని యవ్వనం..
జ్ఞాపకం లేని వృద్దాప్యం అనవసరం - వినే టైమ్ చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది.
- పాలిచ్చి పెంచిన తల్లులు.. వాళ్లకి పాలించడం తెలీదా.. పాలించలేరా..
- ఎప్పుడు పిల్లలు బాగుండాలి అని అమ్మ నాన్నలు అనుకోవడమేనా, అమ్మ, నాన్నలు బాగుండాలి అని పిల్లలు అనుకోరా?
- ఒక యుద్ధం వచ్చిన దేశం లో ఉన్నవాళ్ళందరూ, కులం, మతం ప్రాంతం అనే తేడాలు లేకుండా కలిసిపోతారు సర్. ఒక కష్టం వచ్చినప్పుడే, కుటుంబం లో ఉన్న అందరూ, వాళ్ళ స్వార్థం,ద్వేషం, పగ, అన్ని పక్కన పెట్టి ఒకటవుతారు.
- మనిషిని ప్రేమిస్తే అబద్దం విలువ తెలుస్తుంది కరెక్ట్… కానీ నిజం చెపితేనే కదా, ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది.
- దేనినైనా పుట్టించే శక్తి రెండిటి కే ఉంది ఒకటి నేలకి ఇంకొటి వాలకి ( స్త్రీలకి )
- నిజం చెప్పేటప్పుడే భయం వేస్తుంది..
చెప్పకపోతే ఎప్పుడూ వేస్తుంది.. - దేవుడికి కూడా దక్షిణ కావాలి..
రాజుకి కూడా రక్షణ కావాలి.. - గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్ళతోనే..
ఇలాంటి అద్బుతమైన మాటలతో సినీ ప్రేక్షకులను ఆహ్లాద పరిచి తను మాత్రం మాటల మాంత్రికుడి గా సినీ జగత్తు ని ఏలుతూ, సినీ ప్రేమికులచే గురూజీ గా పిలిపించుకుంటూ..
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నతమైన స్టానమ్ లో నిలిచిన.. ఆకెళ్ళ శ్రీనివాస్ గారికి అదేనండీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి 18ఎఫ్ మూవీస్ తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు ..
–ఆర్టికల్ బై శివ మురళి .