చిరు, బాలయ్య మొదటి సారిగా సంక్రాంతికి 1985 సంవత్సరంలో పోటీ పడ్డారు.

అందులో చిరు చట్టంతో పోరాటం (1985) తో వచ్చి హిట్టు కొడితే..

బాలకృష్ణ ఆత్మ బలం (1985) సినిమా తో వచ్చి ఫ్లాప్ అందుకున్నాడు. కానీ ఈ రెండు సినిమాలకు సంగీతం అందించింది ఒక్కరే కావటం విశేషం. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి.

రెండవ సారి 1987 లో చిరంజీవి దొంగ మొగుడు (1987) తో డ్యూయల్ రోల్ తో వచ్చి బిజినెస్ మేన్ రవితేజ లుక్ లో క్లాస్ ను, అలాగే స్టంట్ నాగరాజు పాత్రల్లో మాస్ ను అలరించి మాసివ్ సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకోగా..

బాలయ్య భార్గవ రాముడు (1987) తో వచ్చి యావరేజ్ గా నిలిచి బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాడు. ఇక్కడ చెప్పుకో దగ్గ రెండు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవే ఈ రెండు సినిమాలకు దర్శకులు, సంగీత దర్శకులు ఒక్కరే కావడం. వారే దర్శకులు కె. కోదండ రామిరెడ్డి, సంగీత దర్శకులు కె. చక్రవర్తి.
చిరు, బాలయ్య ముచ్చటగా మూడోసారి అంటే ఏడాది తిరగకుండానే 1988 సంవత్సరంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మంచి దొంగ (1988) గా రాగా..

బాలకృష్ణ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో ఇన్స్పెక్టర్ ప్రతాప్ (1988) గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
నాలుగో సారి సంక్రాంతి బరిలో నిలిచిన మెగాస్టార్ చిరంజీవి సినిమా మాత్రం చాలా చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చిరంజీవిని వెండితెర మీద కూడా చూడక గడిచిన విరామం అది.
సరిగా చెప్పాలంటే ఏడాది కాలం పాటు సుదీర్ఘ విరామం మెగాస్టార్ ముఖానికి మేకప్ వేసుకోగా. అందుకు కారణం కూడా లేకపోలేదు. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏదో తెలియని పరాజయాన్ని పొందుతూ వస్తూ ఉంటే ఒక సంవత్సరం పాటు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు మెగాస్టార్.
ఈ స్టేట్మెంట్ మెగా ఫ్యాన్స్ ను తీవ్రమైన నిరాశకు గురిచేసింది. అయితేనేం ఏడాది తర్వాత మెగాస్టార్ చేసిన సినిమా ఆ ఏడాది లోటును భర్తీ చేసిన సినిమా అయ్యింది.

ఆ సినిమానే హిట్లర్ (1997). మళయాలంలో మమ్ముట్టి నటించిన హిట్లర్ సినిమాకి ఇది రీమేక్. సెంటిమెంట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకి దర్శకుడు. కోటి సంగీతం అందించిన పాటలు మార్కెట్లో మారుమోగి పోయాయి.
ముఖ్యంగా హబీబీ హబీబీ పాట ట్యూన్.. ఆ పాటకు లారెన్స్ అందించిన కొరియోగ్రఫీ లో చిరు వేసిన క్రేజీ మూవ్స్ ఫ్యాన్స్ కు ఓ రేంజ్ లో కిక్ ఇచ్చాయి. అయిదుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా చిరంజీవి చూపిన గాంభీర్యమైన నటన అఖిలాంధ్ర ప్రేక్షకులను కట్టి పడేసింది. సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

అదే ఏడాది బాలకృష్ణ కుటుంబం.. కుటుంబం.. ఇది అన్నగారి కుటుంబం అంటూ పెద్దన్నయ్య (1997)గా డ్యూయల్ రోల్ లో వచ్చి మెప్పించాడు. అన్నదమ్ముల కథాంశంతో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

అటు పెద్దన్నయ్య గా బాలకృష్ణ అభినయం ఇటు చివరి తమ్ముడుగాను సరదా సరదాగా ఆయా పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించాడు. క్లైమాక్స్ లో వచ్చే రోజా సెంటిమెంట్ సినిమా విజయానికి మరో కారణంగా నిలిచింది.
ఈ రెండు సినిమాలు వారం గ్యాప్ లో విడుదలైనప్పటికీ మహిళా ప్రేక్షకులు మాత్రం అయిదుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా వచ్చిన హిట్లర్ సినిమాకే బ్రహ్మరథం పట్టారు.
అలా ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నప్పటికి మహిళా ప్రేక్షకుల అగ్రతాంబూలం అందుకున్న హిట్లర్ సినిమానే ఆ టాప్ గ్రాసర్ గా టాప్ సూపర్ హిట్ మూవీ గా నిలిచింది.
అయిదో సారి సంక్రాంతి బరిలో చిరంజీవి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రెండవ సారి చేసిన అన్నయ్య (2000)తో రాగా…

బాలకృష్ణ దర్శకుడు శరత్ తో చేసిన వంశోద్దారకుడు (2000) సినిమా తో పోటీ పడ్డారు. ఇందులో చిరు ఆంధ్ర దేశానికి అన్నయ్య గా భారీ విజయాన్ని మరోసారి తన ఖాతాలో వేసుకోగా బాలకృష్ణ సినిమా మాత్రం తీవ్రంగా నిరాశా పరిచింది.

అన్నయ్య సినిమాకి చిరు కామెడీ టైమింగ్, రాజారాంతో ఆత్మారం గా చిరు డ్యూయల్ గా కనిపించి మెప్పించిన సీన్స్ ఫ్యాన్స్ ను బాగా అలరించాయి. అలాగే సినిమాకు మణిశర్మ అందించిన బాణీలు అటు ఆడియో పరంగాను మెగాస్టార్ అన్నయ్య సినిమా సూపర్ హిట్ గా నిలిచేలా చేశాయి.
ఆరోసారి మాత్రం మెగా ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని చేదు అనుభవం ఎదురైంది.

అదే 11 జనవరి 2001 వ తేది. ఓకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా విడుదలైన మెగాస్టార్ మృగరాజు (2001)…….

నటసింహం నరసింహనాయుడు (2001) సినిమాల్లో బాక్సాఫీస్ దగ్గర నరసింహనాయుడు చేతిలో మృగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాలకృష్ణ ఆ ఏదాడి ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి ఫ్యాక్షన్ పాత్రలో చెలరేగిపోయాడు. సినిమాలో బాలకృష్ణ పేల్చిన పంచ్ డైలాగ్స్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా లాంటి డైలాగ్స్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. దీనికి తోడు మణిశర్మ బాణీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కానీ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మృగరాజు మాత్రం పేలవమైన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ కు కొత్తదనం ఇవ్వడంలో ఫెయిలై తీవ్రంగా నిరాశ పరిచింది. మణిశర్మ చిరు కాంబోలో వచ్చిన ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ మాత్రం రికార్డ్ స్థాయిలో ఆదిత్య మ్యూజిక్ కంపెనీ దక్కించుకుంది.

అదే ఆదిత్య మ్యూజిక్ కంపెనీ అక్షరాల కోటి రూపాయలకు మృగరాజు ఆడియో రైట్స్ కొనుగోలు చేసింది. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ కు మాత్రం ఈ సినిమా తీవ్రమైన నిరాశకు గురిచేసింది అనడంలో సందేశం ఏ మాత్రము లేదు. ఇక్కడ కూడా రెండూ సినిమాలకు సంగీతం అందించింది మెలోడీ బ్రహ్మ మణిశర్మ.

ఏడో సారి మెగాస్టార్ చిరంజీవి వెండితెర మీద గ్రాఫిక్స్ తో మెగా మాయాజాలం చేసి చూపే దర్శకుడు కోడి రామకృష్ణ తో కలసి అంజి (2004)తో రాగా..

బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ (2004) తో సంక్రాంతి బరిలో నిలిచారు. ఇందులో హై ఎక్స్పెక్టేశన్స్ తో వచ్చిన అంజి (2004) సినిమా మ్యూజికల్ హిట్టుకు మాత్రమే పరిమితం అవగా..
తమిళ సినిమా సామికి రీమేక్ గా వచ్చిన బాలకృష్ణ లక్ష్మీ నరసింహ (2004) బాక్సాఫీస్ దగ్గర పోలీస్ పవర్ చూపటంతో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో మెప్పించి సంక్రాంతి విజేత గా నిలిచేలా చేసింది. ఈ రెండు సినిమాలకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు సమకూర్చారు.
ఎనిమిదో సారి సంక్రాంతికి విడుదలైన చిరు, బాలయ్య సినిమాలు చాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాజకీయ ప్రవేశం చేసి సుమారుగా దశాబ్దం అంటే పది సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి కంబ్యాక్ సినిమాగా కావడమే ఇక్కడ విశేషం.

అంటే చిరు చివరిగా స్క్రీన్ మీద కనిపించింది గెస్ట్ రోల్ చేసిన మగధీర (2009) సినిమాలోనే. పదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఖైదీ నంబర్ 150 (2017) సినిమాతో వచ్చాడు.
ఇది విజయ్ నటించిన తమిళ సినిమా కత్తికి రీమేక్. సినిమాలో చిరు డ్యూయల్ రోల్ పర్ఫార్మెన్స్, దేవి శ్రీ ప్రసాద్ రాకింగ్ ట్యూన్స్ సినిమా విజయానికి హైలెట్ గా నిలిచాయి.

అందులోను చిరు చేసిన అమ్మడు లెట్స్ డు కుమ్ముడు, మి మి మిమి పాటలతో పాటు ఇంట్రడక్షన్ పాటలో రాయ్ లక్ష్మితో చేసిన సాంగ్స్ లోని గ్రేస్ఫుల్ స్టెప్స్ బాస్ కి ఈ టెన్ ఇయర్స్ జస్ట్ టైం గ్యాప్ అంతే గ్రేసులోను మాసులోను బాస్ టైమింగ్ లో గ్యాప్ లేదని నిరూపించి బాక్సాఫీస్ వద్ద వందకోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి మెగా సూపర్ హిట్ గా నిలిచింది.

బాలకృష్ణ మాత్రం సమయం లేదు మిత్రమా అంటూనే సంక్రాంతికి
గౌతమీ పుత్ర శాతకర్ణి (2017)తో బాక్సాఫీస్ వద్ద తలపడ్డాడు.

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు జాతి పౌరుషం, చరిత్ర ను తెలియజేసే కథాంశం కావడం, సినిమాలోని యుద్ధ సన్నివేశాలు, శాతకర్ణిగా బాలయ్య నటన వెరిసి సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం బాస్ ఈజ్ బ్యాక్ సినిమాకే పట్టం గట్టారు.

ఇలా పలు సార్లు చిరు, బాలయ్య సంక్రాంతి బరిలో తమ తమ సినిమాలను విడుదల చేసి కొన్నిసార్లు విజేతలుగా, మరి కొన్నిసార్లు పరజితులుగా నిలిచినా కూడా గెలుపైన ఓటమైన సమఉజ్జి చేతిలో ఉంటేనే ఆట మరింత ఆసక్తిగా ఉంటుందనేది వీరి సినిమాలే నిరూపించాయి.
థాంక్ యు, ఇలాంటి అద్బుతమైన స్టోరీ తో మరలా మీ ముందుకు వస్తాను ..
PHOTOS courtesy by: ADITYA music & GOOGLE.
మీ శివ మురళి.