తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ఓపెన్ లెటర్ టు తెలంగాణ ముఖ్యమంత్రి !

IMG 20240524 WA0125 e1716562497415

విషయం: అందెశ్రీ గారు రచించిన ‘జయజయహే తెలంగాణ…’ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా మీరు ప్రకటించి విడుదల చేయబోతున్నందుకు తెలంగాణ ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ కళాకారులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు మా తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) కూడా గర్వపడుతున్న గొప్ప సందర్భం ఇది.

పదేళ్ల క్రితమే గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రజలకు అందిస్తే ఎంతో బాగుండేది. అలా జరగకపోవడం దురదృష్టకరం.గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసింది.రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైయ్యింది.అలాంటి పాటని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.

IMG 20240525 WA0123

ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయింది. మళ్ళీ మీ వల్ల పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. ఈ పాటని బతికిస్తున్నందుకు ధన్యవాదాలు. అన్నీ బాగానే ఉన్నా ఇంతటి గొప్ప పాటని సంగీత దర్శకులు కీరవాణి గారికి సంగీతాన్ని అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుందని మీకు తెలియస్తున్నాము.

తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో మీకు తెలియంది కాదు,మన ఉద్యోగాలు మనకే రావాలి,మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం.

ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి, అలాగే పక్క రాష్ట్రాల వాళ్ళు ఆ పాటకి సంగీతాన్ని అందించడమేంటి అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఇది మీరు గ్రహిస్తారని తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA) కళాకారులుగా కోరుతున్నాము.

ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాము.

అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వివాదాలకు దూరంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ పిల్లలతో ఒక బృంద గానంగా పాడించి విడుదల చేస్తే… ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అనే గీతంలా గౌరవింపబడు తుందనేది మా అభిప్రాయం.

ఇది మా సలహా మాత్రమే ఈ చారిత్రక గీతాన్ని ఒక చారిత్రక తప్పిదంగా చేయకూడదని మిమ్మల్ని కోరుకుంటూ….

మీ

తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ (TCMA)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *