Remembering B A Raju Garu on his 64 Birth Anniversary : నేడు ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి ఏ రాజు 64వ జయంతి !

IMG 20240106 WA0124

 

తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో సినీ జర్నలిస్టుగా, పి ఆర్ ఓ గా, పత్రిక..వెబ్సైట్ అధినేతగా,నిర్మాతగా, ప్రసిద్ధికెక్కిన బి ఏ రాజు, (జనవరి 7న) 64వ జయంతి సందర్భంగా…

సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలను చూసే పి ఆర్ ఓ గా సినీ కేరీర్ ని ఆరంభించిన బి.ఏ.రాజు ఆ తరువాత ఆయన ప్రోత్సహంతోనే సినీ పాత్రికేయుడిగా రాణించారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని, వంటి దిన వార పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన పిమ్మట తన సతీమణి బి జయ సహచర్యంతో 1994 లో సూపర్ హిట్ వార పత్రిక స్థాపించి, తెలుగు సినీ వార్తాపత్రికలలో సంచలనం సృష్టించారు.

ఆయన మరణం వరకు ఒక్క సంచిక మిస్సవకుండా 27 సంవత్సరాలపాటు పత్రికను దిగ్విజయంగా నిర్వహించారు. కేవలం సినీ జర్నలిస్టుగానే కాకుండా అగ్ర దర్శకులకు, హీరోలకు, హీరోయిన్లకు గైడ్ లైన్స్ ఇస్తూ వారి సినీ కెరీర్ కి మార్గదర్శకుడిగా నిలిచారు. షుమారు 1500 చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇంఛార్జిగా పని చేసిన బి.ఏ.రాజు ఆయా చిత్రాల విజయాలకు దోహదపడ్డారు.

IMG 20240106 WA0127

చిత్ర పరిశ్రమలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పర్చుకున్న అజాత శత్రువు బి.ఏ.రాజు. తెలుగు సినీ రంగం హైదరాబాద్ బదిలీ కావడంతో 2001 లో సూపర్ హిట్ అడ్మిస్ట్రేషన్ ఆఫీస్ కూడా హైదరాబాద్ కు షిఫ్ట్ చేసారు.

ఈ ఏడాదే అయన నిర్మాతగా, ఆయన భార్య బి జయ దర్శకురాలిగా ‘ప్రేమలో పావని కళ్యాణ్’ అనే చిత్రంతో ఆర్ జే సినిమాస్ బ్యానర్ మీద నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.

రాజు గారు ప్రారంభించిన ఇండస్ట్రీ హిట్ వెబ్ సైట్ ద్వారా, దాదాపు 7 లక్షల మంది ఫాలోవర్స్ కలిగిన ఎంతో పాపులర్ అయిన ఆయన (ట్విట్టర్) ఎక్స్ అకౌంట్ ద్వారా పరిశ్రమకు సంబంధించిన వార్తా విశేషాలు ఎప్పటికప్పుడు ఆయన బృందం, BA Raju’s Team ద్వారా అందిస్తున్నారు. ఆర్ జే సినిమాస్ ద్వారా కూడా ఆయన తనయుడు శివకుమార్ బి నిర్మాతగా త్వరలో ప్రముఖ హీరోలతో చిత్రాలను ప్రకటించనున్నారు.

IMG 20240106 WA0125

చిత్ర పరిశ్రమ ప్రముఖులందరితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ… ముఖ్యంగా ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు లతో మంచి అనుబంధం ఉండేది. ఆయన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పనిచేసారు. సినీ పాత్రికేయులకు ఈ కష్టం వచ్చినా నేనున్నాని, ఆర్ధిక, హార్దిక భరోసా ఇచ్చేవారు.

ఏ దర్శకుడు ఏ హీరోతో ఎన్ని సినిమాలు నిర్మించాడో? బ్యానర్ పేరు, విడుదల తేదీ ఆ మూవీ ఎన్ని రోజు ఈ సెంటర్లలో ఆడిందో వంటి వివరాలను తడుముకోకుండా టక్కున చెప్పేవారు.

 

అంతటి సినిమా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. 24 గంటలు సినిమా గురించే ఆలోచించే బి.ఏ.రాజు మన మధ్యన లేకపోవడం బాధాకరం. ఏ లోకాన వున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 64వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *