Raviteja ‘s RT75 will be Produced under Sithara entertainment : రవితేజ 75వ చిత్రం కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు !

IMG 20240409 WA0122 e1712657864239

మాస్ మహారాజా రవితేజ తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో రెండున్నర దశాబ్దాలకు పైగా అలరిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. హాస్యాన్ని పండించడంలో రవితేజది విభిన్న శైలి. అలాంటి విలక్షణమైన శైలిలో పూర్తిస్థాయి వినోదభరిత పాత్రలో మాస్ మహారాజాను చూడటానికి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

విభిన్న తరహా చిత్రాలతో తన అభిమానులను, సినీ ప్రేమికులను అలరించేందుకు అవిశ్రాంతంగా వరుస చిత్రాలు చేసుకుంటూ వెళ్ళడం రవితేజకు అలవాటు. ఇప్పుడు, ఆయన తన కెరీర్‌లో 75వ చిత్రం మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమయ్యారు.

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని రవితేజ ల్యాండ్‌మార్క్ చిత్రం ప్రకటన వచ్చింది. ఇది రవితేజ శైలిలో ఉండే మాస్ ఎంటర్టైనర్. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తేనే, ఈ సినిమా ‘దావత్’లా ఉండబోతుందనే అభిప్రాయం కలుగుతోంది.

భారీస్థాయిలో నిర్వహించబడుతున్న ఊరి జాతరను చూపిస్తూ, సృజనాత్మకంగా రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. రవితేజ 75వ చిత్రం అని తెలుపుతూ కళ్ళద్దాల మీద ‘RT 75’ అని రాయడం బాగుంది. అలాగే పోస్టర్ మీద “రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపోండ్రి”, “హ్యాపీ ఉగాది రా భయ్” అని తెలంగాణ యాసలో రాసి ఉండటం గమనించవచ్చు.

దీనిని బట్టి చూస్తే తెలంగాణ నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర పేరు “లక్ష్మణ భేరి” అని తెలిపిన మేకర్స్.. ఈ పాత్ర తీరు ఎలా ఉండబోతుందో కూడా ఉగాది పంచాంగం రూపంలో చెప్పారు. “ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో” అంటూ రవితేజ పోషిస్తున్న పాత్ర గురించి పోస్టర్ పై రాసుకొచ్చిన తీరు భలే ఉంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రతిభావంతులైన స్వరకర్త భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

2025 సంక్రాంతికి ఈ చిత్రం “ధూమ్ ధామ్ మాస్” దావత్ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *