చిత్రం: రాజు యాదవ్ ,
విడుదల తేదీ : మే 24, 2024
నటీనటులు: గెటప్ శ్రీను, అంఖితా కారట్, ఆనంద చక్రపాణి, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచర్ల తదితరులు…,
దర్శకుడు: కృష్ణమాచారి. కె,
నిర్మాత: రాజేష్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి,
సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్,
సినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్,
ఎడిటింగ్: బొంతల నాగేశ్వర రెడ్డి,
మూవీ: రాజు యాదవ్ రివ్యూ ( Raju Yadav Movie Review)
జబర్దస్ట్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా అంఖితా కారట్ హీరోయిన్ గా వచ్చిన చిత్రం రాజు యాదవ్. కాగా ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయింది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో మా 18 F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !.
కధ పరిశీలిస్తే (Story Line):
రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ఓ ప్రమాదం కారణంగా ఎప్పటికీ నవ్వుతున్నట్లు అతని ఫేస్ లో మార్పులు వస్తాయి. ఆపరేషన్ చేస్తే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ చెబుతాడు. కానీ, ఆపరేషన్ కి డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి స్వీటీ (అంఖితా కారట్) వస్తోంది.
ఆ తర్వాత రాజు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది?,
స్వీటీ – రాజు మధ్య అసలేం జరిగింది ?,
వీళ్ళ మధ్య ప్రేమ అనేది ఉందా ? లేదా ?,
చివరికి రాజు యాదవ్ కథ ఎలా ముగిసింది?
అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే మీరు ఈ సినిమాని చూడాల్సిందే.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
రాజు యాదవ్ సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యులర్ గా సాగడం ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యింది. అదేవిధంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే చాలా స్లోగా సింపుల్ గా సాగింది.
హీరో గెటప్ శ్రీను తాను ఎందుకు స్వీటీని ప్రేమిస్తున్నాడో అసలు ఆమె కోసం అతను ఎందుకు పిచ్చోడిగా అయిపోయాడో ఇంకా బలంగా చూపించాల్సింది. దీనికితోడు రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి. దర్శకుడు కృష్ణమాచారి. కె ఆసక్తికరమైన డ్రామాను జనరేట్ చేయడంలో విఫలమయ్యాడు. సెకండ్ హాఫ్‌లో చాలా సన్నివేశాలు మరీ సిల్లీగా నడిచాయి. అయినా ఈ సిల్లీ లవ్ డ్రామాకు అంత పెద్ద ల్యాగ్ ఏమిటో డైరెక్టర్ కే తెలియాలి.
పైగా మెయిన్ క్యారెక్టరైజేషన్స్ క్లైమాక్స్ లో ఇంట్రెస్ట్ గా అనిపించినప్పటికీ.. సినిమా మొత్తం వచ్చే సరికి ఆ క్యారెక్టరైజేషన్స్ కి క్లారిటీ మిస్ అయి ఆకట్టుకోవు. అలాగే సినిమాలో కొన్ని చోట్ల నాటకీయత ఎక్కువవడంతో కథలో పూర్తిగా సహజత్వం లోపించింది. మొత్తమ్మీద ఈ రాజు యాదవ్ సినిమా నిరాశ పరిచింది. కథలో లాజిక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా లేదు.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
ఈ చిత్ర దర్శకుడు కృష్ణమాచారి. కె తన దర్శకత్వ పనితనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిల్ అయ్యాడు. స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఓ హై ఫై సాఫ్ట్ వేర్ అమ్మాయితో ఓ సాధారణ కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది ? అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ఇలా చెప్పుకోవడానికి మంచి పాయింట్ అయినా, దర్శకుడి ఇన్ ఎక్స్పెరియన్స్ వలన సరిగా హ్యాండిల్ చేయలేక పోయాడు.
గెటప్ శ్రీను తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్ లో మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో గెటప్ శ్రీను తన హావభావాలతో ఆకట్టుకున్నాడు.
ఇక హీరోయిన్ గా నటించిన అంఖితా కారట్ తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది.
హీరోకి తండ్రిగా నటించిన ఆనంద చక్రపాణి కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే, మరో కీలక పాత్రలో నటించిన సంతోష్ కల్వచర్ల మెప్పించాడు. మిర్చి హేమంత్ నటన బాగుంది. ఇక జబర్దస్త్ సన్నీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
సినిమాలో క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే కంటనీరు పెట్టుకోకుండా ఉండలేరు. కొన్ని సెంటిమెంట్ సీన్స్ పర్వాలేదు, ముఖ్యంగా తండ్రి – కొడుకుల మధ్య సీన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ బాగానే ఉంది. రెండు సాంగ్స్ అయితే సోషల్ మీడియా లో బాగా పాపులర్ అయ్యాయి.
సురేష్ బొబ్బిలి అందించిన బాక్ గ్రౌండ్ స్కోర్ ఒకే. కొన్ని సీన్స్ లో అయితే బాగానే ఎలివేట్ అయినా, స్లో నరేటివ్ సీన్స్ వలన, చాలా చోట్ల బోరింగ్ అనిపిస్తుంది.
సాయి రామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి.
బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్ పర్వాలేదు, కానీ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకు ప్లస్ అయ్యేది.
నిర్మాతలు రాజేష్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
గెటప్ శ్రీను లీడ్ యాక్టర్ గా వచ్చిన ‘రాజు యాదవ్’ సిన్మా లో లవ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కొన్ని కామెడీ సీన్స్ అండ్ లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి కానీ, చిన్న పాయింట్ ఉన్న కధని పట్టుకొని రెండు గంటలు సాగదీసి నట్టు అనిపించింది.
ఇంకా దర్శకుడి స్లో అండ్ బ్యాడ్ నేరేషన్, బోరింగ్ ట్రీట్మెంట్ అలాగే ఆసక్తికరంగా సాగని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకు మైనస్ అయ్యి సీట్ లోనుంచి ఎప్పుడు గెట్ అవుట్ అవుదామా అనిపించింది. లీడ్ పాత్రలో గెటప్ శ్రీను బాగానే చేసినా తన కోసమే ఓక లోపం క్రియేట్ చేసి, తన యాక్టింగ్ కోసమే రెండు మూడు ఎమోషనల్ సీన్స్ యాడ్ చేసినట్టు ఉంది కానీ, అవి కధ ని ఎమోషనల్ గా డ్రైవ్ చేయడానికి పనికిరాదు.
ఓవరాల్ గా ఈ రాజు యాదవ్ చిత్రం సామాన్య ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.