purnodaya creations: ఏడిద నాగేశ్వరావు 7వ వర్ధంతి , అక్టోబర్ 4న ఎక్కడ అంటే ?

edidha nag

 

తెలుగు సినిమా వెండి తెర మీద  ‘పూర్ణోదయ’ వెలుగులు.. 

ఆయన ప్లాన్ చేసి సినిమాలు తీయలేదు.. పాన్ ఇండియా సినిమా కలలు కనలేదు. తీసిన ప్రతి సినిమా పాన్ ఇండియాగా మారింది. ఆయన ఎవరో ఓ లుక్ వేద్దామా ? ఆ వెలుగులు ఏమిటోచూద్దాం.

తెలుగు సినిమా రంగానికి ఆయన ఓ ఆభరణం.. అలా శంకరశాస్త్రి దరిచేరి ‘శంకరాభరణ’మైంది. ‘స్వయంకృషి’తో హిట్టు కొట్టారు.. ‘సీతాకోక చిలుక’ను పట్టారు. ఎంతోమంది ‘సితార’లకు ‘అపద్బాంధవుడ’య్యారు.

kamal సాగరసంగమం

‘స్వరకల్పన’ అనితర సాధ్యం.. ఆ ‘సిరిసిరి మువ్వల’ సవ్వడి అనన్యసామాన్యం. అందుకే సినిమా రంగానికి దొరికిన ‘స్వాతిముత్యం’

ఏడిద నాగేశ్వరరావు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అంటేనే ఓ స్వరఝరి.. ప్రత్యర్థులకు అలజడి. అక్టోబర్ 4న పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు 6 వ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనమిది.

అనేక కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ఘనత ఆయనది. సినిమా రంగంలో ఏదో సాధించాలని మద్రాసు రైలెక్కిన ఆయన కాలక్రమేణా అభిరుచి గల నిర్మాతగా మారతారని ఎవరూ ఊహించలేదు.

edidha nag 5
నాటకాల నుంచి సినిమాల వైపు:

తూర్పుగోదావరి జిల్లా లోని కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు 1934 ఏప్రిల్ 24న ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. కాకినాడ మెటలారిన్‌ హైస్కూల్‌లో ఫిఫ్త్‌ ఫారమ్‌ చదువుతుండగా స్కూల్‌ వార్షికోత్సవంలో ‘లోభి’ అనే నాటకంలో తొలిసారిగా అమ్మాయి వేషం వేశారాయన.

దానికి రజత పతకం అందుకోవడంతో నటనపై మక్కువ పెరిగింది. అలా నాటకాల వైపు జీవిత పయనం సాగింది. అది ఎక్కడిదాకా వెళ్లింది అంటే మద్రాసు రైలెక్కి చెన్నపట్నం చేరేదాకా వెళ్లింది. చిన్నాచితకా వేషాలు వేస్తూ బతుకు బండి సాగించారు.

edidha నాగ

భుక్తి కోసం డబ్బింగ్ కూడా చెప్పాల్సి వచ్చింది. కొంతమంది స్నేహితుల ప్రోత్సాహంతో గీతాకృష్ణా కంబైన్స్ బ్యానర్ మీద ‘సిరిసిరి మువ్వ’ చిత్ర నిర్మాణాన్ని 1976లో చేపట్టారు. ఆ సినిమా ఘనవిజయంతో ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు.

పూర్ణోదయ

పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ సంస్థను స్థాపించి ‘తాయారమ్మ బంగారయ్య’ నిర్మించారు . అది కూడా ఘనవిజయం సాధించింది. కళా తపస్వి కె. విశ్వనాధ్ తో సిరిసిరి మువ్వ నుంచి ఉన్న అనుబంధం ‘శంకరాభరణం’ వైపు దారి చూపింది. దాంతో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు పాకింది.

అటు కలెక్షన్ల పరంగా ఇటు సంగీతపరంగా ఆ సినిమా సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అప్పట్లో ఏ నోట విన్నా శంకరాభరణం మాటే.. ఏ చోట విన్నా బాలు పాటే.

edidha nag 1
హిట్ల బాటలో నిర్మాతగా పయనం:

ఆ తర్వాత ‘సీతాకోకచిలుక’ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్ . అనేక ప్రేమ కథా చిత్రాలకు ఇది ప్రేరణ అనడం కూడా అతిశయోక్తి కాదు. ఆయన ఏ చిత్ర నిర్మాణం చేపట్టినా అది హిట్ల బాటే. కమలహాసన్, కె.విశ్వనాధ్ కాంబినేషన్ లో ‘సాగర సంగమం’ మరో క్లాసికల్ మూవీ అయ్యింది.

kamal సాగరసంగమం 2

కమల్ నటనకు జనం నీరాజనం పట్టారు. తెలుగు, తమిళం, మలయాళం లో ఒకే సారి విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ‘సితార’కు శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా తన వద్ద అనేక చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీకి దర్శకుడిగా అవకాశం ఇచ్చి మరీ ఈ సినిమా నిర్మించారు.

సుమన్, భానుప్రియ జంటగా రూపొందిన ఆ సినిమా కూడా మరో క్లాసిక్ . జాతీయ అవార్డును సైతం సాధించిపెట్టింది.

edidha nag 7

‘ స్వాతిముత్యం’ గురించి ప్రత్యేకించే చెప్పే పనే లేదు. కమల్ హాసన్, రాధిక జంటగా రూపొందిన ఈ సినిమాకి విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. 1986లో విడుదలైన ఈ సినిమా అన్ని రికార్డులనూ తిరగరాసింది. అటు జాతీయ అవార్డు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును సైతం ఈ సినిమా సంపాదించి పెట్టింది. అంతేకాదు అంతర్జాతీయ అవార్డు

అయిన ఆస్కార్ కు మన దేశం తరఫున ఎంపికైన ఘనత కూడా ఈ తెలుగు సినిమా దక్కించుకుంది. ఆయన నిర్మించిన ప్రతి సినిమా ఓ క్లాసిక్ అనే చెప్పాలి. అలాగని కమర్షియల్ అంశాలను కోల్పోలేదు. క్లాసికల్ గా ఈ తరహా కమర్షియల్ తీయవచ్చని ఏడిద నాగేశ్వరరావు నిరూపించారు.

edidha nageswara rao swayam krushi

అప్పటిదాకా ఆయన కమల్ హాసన్ తోనే ఎక్కువగా సినిమాలు చేశారు. తెలుగులో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమాలు తీయాలన్న సంకల్పం ఆయనను ‘స్వయంకృషి’ వైపు నడిపించింది. 1987లో ఈ సినిమా కొత్త చిరంజీవిని ప్రజలకు పరిచయం చేసింది. చెప్పులు కుట్టుకునే సాంబయ్య పాత్రను మెగాస్టార్ చిరంజీవి అంగీకరించడమూ సాహసమే.

మెగాస్టార్ చిరంజీవికి ఉత్తమ నటుడిగా మొదటిసారిగా నంది అవార్డును ప్రసాదించిన సినిమా ఇది. మెగాస్టార్ లోని నట విశ్వరూపాన్ని మరోసారి ‘అపద్భాంధవుడు’గా చూపారు. తన కుమారుడు ఏడిద శ్రీరాంను హీరోగా చేసి తీసిన ‘స్వరకల్పన’ అవేరేజ్ గా ఆడింది .

పూర్ణోదయ అవార్డ్స్
ఇలాంటి అభిరుచి గల నిర్మాతలను రఘుపతి వెంకయ్య , పద్మపురస్కారాలతో సత్కరించడం చాలా అవసరం. కీర్తిశేషులు అయ్యాక కూడా ఇవి ఇవ్వచ్చు . ఆయన మన ముందు లేకపోయినా ఆయన నిర్మించిన సినిమాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి.. మనల్ని పరవశింపజేస్తూనే ఉంటాయి.

“ పూర్ణోదయా” ఆణిముత్యాలు

సిరి సిరి మువ్వ
తాయారమ్మ బంగారయ్య
శంకరాభరణం
సీతాకోకచిలక
సాగర సంగమం
స్వాతిముత్యం
సితార
స్వయంకృషి
స్వరకల్పన
ఆపత్బాంధవుడు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *