Padma Vibhushan Chiranjivi Celebs Republic Day with Fans: ఈ రిపబ్లిక్ డే నాకెంతో ప్రత్యేకం : మెగాస్టార్ చిరంజీవి !

IMG 20240126 WA00941 scaled

 జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలను చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో వరుణ్ తేజ్, సుష్మిత కొణిదెల, చిరంజీవి మనవరాళ్లు నవిష్క, సమరలతో పాటు అభిమానులు పాల్గొన్నారు.

చిరంజీవికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించటంతో ఈ వేడులు మరింత ప్రత్యేకతగా మారాయి. జెండా వందనం చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘75వ రిపబ్లిక్ డే సందర్భంగా యావన్మంది భారతీయులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

ఈరోజున మనం ఇంత స్వేచ్చగా ఉంటున్నామంటే అందుకు కారణం.. ఎంతో మంది మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారు. వారి త్యాగఫలమే ఈ స్వేచ్ఛ. ఈ సందర్భంగా వారు చేసిన త్యాగాలను తలుచుకుంటూ వారికి నివాళి అర్పించటం మన కనీస బాధ్యత.

ఈ సందర్భంగా అలాంటి మహనీయులందరికీ, త్యాగధనులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఈ రిపబ్లిక్ డే నా వరకు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అందుకు కారణం.. నా 45 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో నేను ఈ సినీ కళామతల్లికి సేవ చేసుకున్నాను.

అలాగే కళాకారులకు సామాజిక బాధ్యత కూడా ఉంది అనేదాన్ని నా బాధ్యతగా భావించాను. ఎన్నో సంవత్సరాలుగా విపత్తులు జరిగినా, అవసరార్థులకు ఆయా సమయాల్లో అండగా నిలబడ్డాను. నా వంతు సామాజిక సేవ చేసుకుంటూ వచ్చాను. అందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశాం. ఇది ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది.

పాతికేళ్ల ముందు రక్తం కొరతతో ప్రాణాలను కోల్పోతున్నారు అనే మాట నుంచి ఇప్పుడు అలాంటి ప్రస్తావన రాలేదంటే నేను తీసుకున్న నిర్ణయం పట్ల గర్వపడుతున్నాను. దానికి ప్రధాన కారణం నా అభిమానులే. అభిమానులు లేకుండా ఉండుంటే ఇది ఇంత గొప్పగా, ఓ యజ్ఞంలా ఇక్కడి వరకు వచ్చేది కాదు. దీనికి కారణమైన నా బ్లడ్ బ్రదర్స్, బ్లడ్ సిస్టర్స్‌కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.

ఇదే స్ఫూర్తితో మీరందరూ సామాజిక సేవ చేస్తూ, నన్ను ఉత్సాహపరుస్తూ నేను మరింత ముందుకు వెళ్లేలా మీ అండదండలను నాకు అందించాలని కోరుకుంటున్నాను. నేను చేసిన ఈ సేవలను గుర్తించి 2006లో నాకు పద్మ భూషణ్ అవార్డునిచ్చారు. అదే చాలా ఎక్కువ ప్రోత్సాహానిచ్చింది. అయితే పద్మవిభూషణ్ అవార్డును నేను ఊహించలేదు.

2024లో నా కళ, సామాజిక సేవలను గుర్తించి పద్మవిభూషణ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం అనేది ఎంతో సంతోషాన్నిస్తుంది. దీనికి కారణమైన ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ప్రధాని మోడీగారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను.

అలాగే పద్మ అవార్డులను అందుకుంటున్న నాతోటి వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను… జై హింద్’’ అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *