NTR Centenary Celebrations: చైన్నైలో ఎన్.టి.ఆర్. శతజయంతి సెంటినరీ కమిటీ సమాలోచన ప్రెస్ మీట్ !

ntr 100 years celebrations 2

మద్రాసులో నట జీవితాన్ని ప్రారంభించిన నందమూరి తారక రామారావు మహానటుడుగా, మహోన్నత నాయకుడిగా భావితరాలకు స్ఫూర్తిని కలిగించారని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ చెన్నైలోని ఆంధ్రాక్లబ్ లో సమాలోచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చైర్మన్ టి.డి. జనార్థన్ మాట్లాడుతూ రామారావుగారి స్ఫూర్తితో తాను రాజకీయ రంగంలో ఎదిగానని, ఆయన తెలుగు జీవితంలో కొత్త వెలుగులు నింపారని ఎంతోమందికి రాజకీయ అవకాశాలను కల్పించారని, పేదవారి అభ్యున్నతికి పాటుపడ్డారని, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని తెలిపారు.

యన్ టి రామారావు గారు భావితరాలకు స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో తాను కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ ఎన్.టి.ఆర్. అసెంబ్లీ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్. చారిత్రక ప్రసంగాలు, శకపురుషుడు అన్న గ్రంథాలను వెలువరించిందని, జై ఎన్.టి.ఆర్. అన్న వెబ్ సైట్ ను కూడా ప్రారంభించామని తెలిపారు.

ntr 100 years celebrations

ఎన్.టి.ఆర్.తో ‘నిప్పులాంటి మనిషి’, ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘శృంగార రాముడు’ లాంటి చిత్రాల్లో ఎన్.టి.ఆర్. పక్కన కథానాయికగా నటించిన లత మాట్లాడుతూ ఆయనతో నటించటం చాలా కష్టమని, సీరియస్ గా ఉంటారని, మొదట తనను ఎంతోమంది భయపెట్టారని, అయితే ఆయన సహ నటీ, నటులకు తోర్పాటునందించి ప్రొత్సహిస్తారని తాను తెలుసుకున్నానని, నటుడుగా ఆయనలో ఎంతో అంకిత భావం ఉందని, అలాగే క్రమశిక్షణకు ఆయన మారుపేరని చెప్పారు.

ఎన్.టి.ఆర్.తో 1959లో ‘దైవబలం’ అనే సినిమాలో తన తల్లి అమ్మాజీ హీరోయిన్ గా నటించిందని, తాను 1976లో ‘మాదైవం’ అన్న సినిమాలో రామారావుగారి పక్కన నటించానని ఇది తాను మరచిపోలేనని నటి జయచిత్ర తెలిపారు.

ntr 100 years celebrations 1

1962లో వి. మధుసూధనరావు దర్శకత్వంతో ‘రక్తసంబంధం’ అన్న చిత్రం రూపొందింది. ఎన్.టి.ఆర్., కాంతారావు, సావిత్రి నటించిన ఈ సినిమాకు కె.పి. కొట్టార్కర్ కథను అందించారు.

ఆ కొటార్కర్ తనయుడు, దక్షణ భారత చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు రవి కొట్టార్కర్ మాట్లాడుతూ రామారావు గారిని తాను దగ్గరగా చూశానని, తన తండ్రి అప్పుడు సినిమాకు కథను అందిస్తే పది వేలు తీసుకునేవారని, రామారావు గారు కథ తయారు చేయమని తమ తండ్రికి యాభై వేల రూపాయలు ఇచ్చిన సంఘటన ఇప్పటికీ తాను మరచిపోలేనని, అలాంటి గొప్ప మనస్సున్న నటుడు ఎన్.టి.ఆర్. అని ఆయన తెలిపారు.

NTR 100

సావిత్రి కుమార్తె విజయ ఛాముండేశ్వరి మాట్లాడుతూ రామారావు గారిని తాను మామయ్యా అని పిలిచేదానని, అమ్మా, మావయ్య కాంబినేషన్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయని, మావయ్యకు అమ్మంటే ఎంతో అభిమానమని లంచ్ టైమ్ లో అందరూ ఒక చోట కూర్చుని ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే సన్నివేశాలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

తమిళనాడు రాష్ట్ర మాజీ డి.జీ.పి. ఆర్. శేఖర్ మాట్లాడుతూ తమ వివాహం ఎన్.టి.ఆర్. ప్రోద్భలం వల్లనే జరిగిందని, తమ మామగారి కుటుంబం, ఎన్.టి.ఆర్. కుటుంబం విజయవాడలో పక్క పక్కనే ఉండేవారని, వారు తమ వివాహానికి పోలీసు దుస్సులలో వచ్చారని ఆ తరువాతనే తాను ఐ.పి.ఎస్.కు ఎంపిక కావటానికి ఆ స్ఫూర్తే కారణమని శేఖర్ చెప్పారు.

ntr 100 years celebrations 6

నందమూరి రామకృష్ణ తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని నటుడిగా ఆయనకు తగిలిన దెబ్బల్ని, ఆ దెబ్బల బాధలను లెక్క చేయకుండా షూటింగులో పాల్గొనేవారని, వృత్తిపట్ల, ఆయనకు ఉన్న అంకిత భావాన్ని తాను కళ్లారా చూశానని, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కుటుంబం కన్నా, ప్రజలే మిన్నంటూ వారికే ఎక్కువ సమయాన్ని కేటాయించి బడుగు, బలహీన వర్గాల, సంక్షేమానికి విశేషమైన కృషి చేశారని ఈ సందర్భంగా రామకృష్ణ గుర్తు చేశారు.

ఇంకా ఈ సభలో ఆదిశేషయ్య, సి.ఎమ్.కే. రెడ్డి, జె.కే. రెడ్డి, విక్రమ్ పూల మాట్లాడారు. నిర్మాత, కమిటీ సభ్యుడు కాట్రగడ్డ ప్రసాద్ అతిధులను వేదిక మీదకు ఆహ్వానించారు. కమిటీ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ భగీరథ సభను, అతిథుల ప్రసంగాలను సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అతిథులందరినీ ఛైర్మన్ టి.డి. జనార్థన్ జ్ఞాపికలతో, శాలువాతో సత్కరించారు. కమిటీ సభ్యుడు దొప్పలపూడి రామమోహన రావు వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో 200 వందల మందికి పైగా పాల్గొన్ని కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *