ఎక్కడైనా ఒక సినిమా విడుదల అనేది ఏ నెల రోజులో, ఆరు నెలలో ఇంకా అయితే సంవత్సరమో వాయిదా పడే అవకాశం ఉంటుంది. కానీ ఏఎన్ఆర్ నటించిన ఒక సినిమా మాత్రం 40 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఈ వారం విడుదల అవుతోంది.
ఆ సినిమానే `ప్రతిబింబాలు`.

ఇది కూడా ఒక అరుదైన రికార్డ్ గా చెప్పవచ్చు. ఎందుకంటే సినిమాలో హీరోగా చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఇప్పుడు లేరు.
హీరో చనిపోయిన తర్వాత విడుదలైన సినిమాగాను.. 40 ఏళ్ళ సుధీర్ఘ విరామం తర్వాత డైరెక్ట్ గా థియేటర్స్ కి వస్తున్న సినిమాగా ఒక అరుదైన రికార్డుగా చెప్పొచ్చు కదా!

ఏఎన్నార్, జయసుధ జంటగా నటించిన ఈ సినిమాకికి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. అయితే ఈ సినిమా 1982లోనే చిత్రీకరణ మొత్తం పూర్తయింది.
కానీ కొన్ని ఆర్థిక పరమైన సమస్యల కారణంగా విడుదలకు నోచుకోలేదు.
విడుదల తేదీ ప్రకటించడం, అంతకంతకూ వాయిదా వేయడం అనేది పరిపాటిగా మారిపోయిది. కొన్నాళ్లకు విడుదల చేయాలనే ప్రయత్నాలే వదిలేశారు.

ఏఎన్నార్ నటించిన సినిమాల్లో విడుదల కాకుండా ఉండిపోయిన సినిమాగా దీన్ని చెప్పుకునే వారు అందరూ.
చివరికి ఇప్పుడు మోక్షం లభించింది. ఈనెల 5న ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 250 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. 4కే టెక్నాలజీ, టీడీఎస్ లాంటి ఆధునిక హంగులు ఈ సినిమాకి జోడించారు.

పాత సినిమాలను రీ రిలీజ్ చేసి, ప్రేక్షకులకి మళ్ళీ ఆ రోజుల జ్ఞాపకాలను గుర్తుచేస్తూ మంచిగా వసూళ్లు అందుకొంటున్న ఈ సమయంలో ఈ సినిమాకి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తాయని సినీబృందం నమ్మకంగా ఉన్నారట.
మరి అక్కినేని అభిమానులు ఈ సినిమాని ఏ రీతిన ఆదరిస్తారనేది ఒక రోజు తర్వాత తెలుస్తుంది.
-శివ మురళి