Megastar likes Tillu Square Movie : మెగాస్టార్ చిరంజీవి ‘టిల్లు స్క్వేర్’ చూసి ఏమన్నారంటే !

IMG 20240401 WA0098 e1711989731723

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సామాన్యుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని, భారతదేశంలోనే అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగారు. అలాంటి చిరంజీవి చేత ప్రశంసలు అందుకోవడం అంటే, యువ ఫిల్మ్ మేకర్స్ కి అవార్డు గెలుచుకోవడం లాంటిది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ చిత్రం బృందం ఆ ఘనతను సాధించింది.

2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ సినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

IMG 20240401 WA0100

థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ‘టిల్లు స్క్వేర్’ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. చిత్ర బృందాన్ని తన నివాసానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు ఆయన విలువైన సమయాన్ని ‘టిల్లు స్క్వేర్’ కోసం కేటాయించారు. ‘డీజే టిల్లు’ తనకు బాగా నచ్చిన చిత్రమని, ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ కూడా ఎంతగానో నచ్చిందని చెప్పిన చిరంజీవి, చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు.

IMG 20240401 WA0118

“డీజే టిల్లు నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా చూసి ముచ్చటేసి, సిద్ధుని ఇంటికి పిలిపించుకొని అభినందించాను. సిద్ధుని ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు సిద్ధు ‘టిల్లు స్క్వేర్’తో మళ్ళీ మన ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమాను నేను చూశాను. అద్భుతం.. నాకు చాలా నచ్చింది ఈ సినిమా.

మొదటి సినిమా హిట్ అయ్యి, దానికి సీక్వెల్ చేస్తే ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ సిద్ధు, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత నాగవంశీ మరియు మిగతా టీం అంతా కలిసి ప్రేక్షకులు మెచ్చేలా సీక్వెల్ ని అందించడంలో విజయం సాధించారు.

IMG 20240401 WA0153

అదే ఉత్కంఠ, అదే సరదా, అదే నవ్వులతోటి ఈ ‘టిల్లు స్క్వేర్’ని ఎంతో ఎంజాయ్ చేశాను. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాము, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో అని సిద్ధు నాతో చెప్పాడు. దీని వెనుక దర్శకుడు మల్లిక్ రామ్, ఎడిటర్ నవీన్ నూలి సహా అందరి సమిష్టి కృషి ఉందని తెలిపాడు.

నటుడిగా, కథకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ప్రధాన కారణమైన సిద్ధు జొన్నలగడ్డని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే దర్శకుడు మల్లిక్, నిర్మాత వంశీ, ఎడిటర్ నవీన్ ని అభినందిస్తున్నాను.

ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడగల బలమున్న మనిషి వంశీ. మంచి సినిమాలను నిర్మిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతూ ఉత్తమ యువ నిర్మాతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు వంశీ. అలాగే ‘మ్యాడ్’ సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న కళ్యాణ్.. ఈ సినిమా రచనలో సహకారం అందించాడని తెలిసింది.

‘టిల్లు స్క్వేర్’ చిత్ర బృందాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సినిమా యువతని దృష్టిలో పెట్టుకొని తీసిన అని కొందరు అంటున్నారు. కానీ ఇది అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే సినిమా. నేను ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ సినిమాకి ఎంజాయ్ చేయండి.” అంటూ చిరంజీవి చెప్పిన మాటలు చిత్ర బృందాన్ని ఉత్సాహంలో నింపాయి.

IMG 20240401 WA0048

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న వారిలో కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ఎడిటర్ నవీన్ నూలి, రచయిత-దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఉన్నారు.

‘టిల్లు స్క్వేర్’ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించిన ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి పాటలు స్వరపరచగా, భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *