MAHA MAX Channel Open by PK: పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘మహా మ్యాక్స్’ ఛానెల్ ప్రారంభం!

IMG 20231025 WA0016 e1698210945822

 

గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ‘మహాన్యూస్’. అయితే, ఒకటిన్నర దశాబ్దంగా తెలుగు వార్తా రంగంలో ‘మహా గ్రూప్’ కొనసాగిస్తున్న మహా ప్రస్థానాన్ని… ఇప్పుడు వినోద రంగానికి కూడా విస్తరించింది. మహా న్యూస్ అధినేత మారెళ్ల వంశీ ‘మహా మ్యాక్స్’ పేరుతో సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని జనం ముందుకు తీసుకు వచ్చారు.

తెలుగు వారి లోగిళ్లలోని ఈ నవ్యమైన వినోదాల విప్లవం… ‘మహా మ్యాక్స్’ని… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం ప్రారంభించారు.

హైద్రాబాద్ ఫిల్మ్ నగర్లో ఉన్న జేఆర్సీ కన్వెన్షన్ లో మహా మ్యాక్స్ లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 24న మహా వైభవంగా జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ‘మహా గ్రూప్’ ఉద్యోగులు, సినీ, రాజకీయ, వాణిజ్య, వ్యాపార సంస్థల ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్లొన్న ఈ కార్యక్రమంలో సినీ, సాంస్కృతి, భక్తి నేపథ్యంలో పలు ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి.

IMG 20231025 WA0007

ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన పవన్ కళ్యాణ్‌ ‘మహా మ్యాక్స్’కు ప్రత్యేక శుభాభినందనలు తెలియజేశారు. ఛానల్ లోగోని లాంచ్ చేసిన ఆయన `వివాదాలను కాకుండా కళను ప్రోత్సహించేందుకు ప్రయత్నించా’లంటూ హితవు పలికారు. సినిమా రంగంలోని సెలబ్రిటీలు ‘సాఫ్ట్ టార్గెట్స్’ అవుతుంటారనీ పవన్ చెప్పారు. అటువంటి వారికి మహా మ్యాక్స్ అండగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

“చిత్ర పరిశ్రమని టీఆర్పీలకు వాడుకోవటం మాత్రమే కాకుండా సినీ రంగంలోని సమస్యలపై దృష్టి పెట్టా”లని ఆయన కోరారు. రఘుపతి వెంకయ్య నాయుడు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి అలనాటి మహానుభావులపై కూడా మీడియా దృష్టి సారించాలని పవన్ అన్నారు. ఈ తరం వారికి అప్పటి తరం సినీ లెజెండ్స్ తాలూకు గొప్పతనం తెలపాల్సిన బాధ్యత మహా మ్యాక్స్ పై ఉందని పవర్ స్టార్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

IMG 20231025 WA0017

మహా మ్యాక్స్ ప్రారంభోత్సవ వేళ మహా ఎండీ వంశీ ఛానెల్ లక్ష్యాన్ని తెలియచేశారు. మొదట తాను ఎంటర్టైన్మెంట్ చానల్ పెట్టాలని భావించినప్పుడు ఒకింత వెనకడుగు వేశానని ఆయన అన్నారు. కానీ, పవన్ కళ్యాణ్ తనను వెన్నుతట్టి ప్రోత్సహించారని వివరించారు. సినీ పరిశ్రమకి సైతం ఒక కొత్త వినోదాల వేదిక అవసరం ఎంతైనా ఉందని పవర్ స్టార్ అన్నట్టు వంశీ చెప్పారు. జనసేనాని అందించిన ప్రొత్సాహంతోనే తాను మహా మ్యాక్స్ విజయవంతంగా జనం ముందుకు తెచ్చానని కరతాళ ధ్వనుల మధ్య ఆయన ప్రకటించారు.

ప్రతీ సినిమాకు క్లాప్ నుంచీ సెలబ్రేషన్ వరకూ హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ అందిస్తామని మహా గ్రూప్ అధినేత హామీ ఇచ్చారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా తమకు ఉండదని స్పష్టం చేశారు. వెబ్ సిరీస్ లు, టాలెంట్ హంట్స్ ద్వారా కొత్త ప్రతిభని మహా మ్యాక్స్ వెలికి తీస్తుందని వంశీ హామీ ఇచ్చారు.

మహా మ్యాక్స్ లాంచ్ ఈవెంట్లో పద్మశ్రీ అవార్డ్ గ్రహీత విజేయంద్ర ప్రసాద్ సైతం పాల్గొన్నారు. ఆయన నూతన ఛానల్ కి, టీమ్ కి ఆశీస్సుల్ని అందించారు.

సీనియర్ నటులు మురళీమోహన్ పరిశ్రమ గురించి ప్రస్తావిస్తూ.. అల్లు అర్జున్ కి జాతీయ అవార్డు వచ్చిన సందర్భాన్ని గుర్తు చేశారు. అటువంటి అరుదైన సందర్భాలను టాలీవుడ్ లో సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. మహా మ్యాక్స్ ఇక పై సినీ పరిశ్రమ గర్వించే అంశాలు ఏవైనా ఉంటే ఘనంగా సెలబ్రేట్ చేయాలని సూచించారు.

దానిపై సానుకూలంగా స్పందించిన మహా మ్యాక్స్ ఎండీ వంశీ అదే వేదికపై జాతీయ అవార్డు గ్రహీత, ‘ద కాశ్మీర్ ఫైల్స్’ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ను సన్మానించారు. మురళీ మోహన్, యువ దర్శకుడు వశిష్ఠ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు.

స్టార్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు మహా మ్యాక్స్ కి పరిశ్రమ తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని సభా ముఖంగా హామీ ఇచ్చారు.

 

‘బేబి’ చిత్రంతో కల్ట్ సక్సెస్ ని అందుకున్న నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, ‘మహా మాక్స్… హయ్యెస్ట్ టాక్స్ పేయర్ ఛానెల్ గా ఎదుగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

సీనియర్ నిర్మాత అశ్వనీదత్ మహా మ్యాక్స్ బృందానికి శుభాశీస్సులు అందించారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ ఈవెంట్ ను శ్రేయాస్ మీడియా సంస్థ ఆర్గనైజ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *