ఈ రోజు ‘క్రికెట్ ప్రపంచ కప్’ (ICC World Cup-2023) ఫైనల్ మ్యాచ్ గుజరాత్ లోనీ అహమ్మదాబాద్ లో నరేంద్రమోదీ స్టేడియం లో జరగబోతోంది. ఈ మ్యాచ్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చూస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నిన్న ఒక సంఘటన జరిగింది.
భారత్ మరియు ఆస్ట్రేలియా జట్లు కేఫ్టన్లు ఇద్దరూ ‘రాణి కి వావ్‘ అనే కట్టడం లో నిన్న ఈ వరల్డ్ కప్ ట్రాఫీని పట్టుకుని ప్రదర్శించారు.
మన దేశంలోనే చాలా మందికి ఈ రాణి కి వావ్ కట్టడం గురించి తెలియదు. ఇక విదేశీయులు ఎంత మందికి తెలుస్తుంది. అందుకే దీనికి ప్రచారం కల్పించే ఉద్దేశ్యం లో భాగంగా భారత ప్రభుత్వం ఈ ఫొటో షూట్ ఏర్పాటు చేశారు.
2014 ముందు విదేశీ ప్రముఖులకు దేశంలో ఒకే ఒక గొప్ప కట్టడం లాగా ఒక్క తాజ్ మహల్ మాత్రమే చూపించేవారు. అయితే మోడీ ఈ పద్దతి మార్చి విదేశీ ప్రముఖులు వస్తున్న ప్రతీ సారి వారికి కొత్త కొత్త పర్యాటక ప్రదేశాలు పరిచయం చేస్తూ ఆ ప్రదేశాలకు పరోక్షంగా ప్రచారం కల్పిస్తున్నాడు.
ఇంతకీ ఈ “రాణి కి వావ్” అంటే ఏంటో తెలుసుకుందాం.
“రాణి కి వావ్” అంటే భూమి లోపల 7 అంతస్తుల మెట్ల తో కూడిన దిగుడు బావి ఇది గుజరాత్ రాష్ట్రంలో పటాన్ జిల్లాలో ఉంది.
ఈ దిగుడుబావిని మన 7 అంతస్తుల దేవాలయాన్ని తిరగేసి నిర్మిస్తే ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో భూమి లోపల నిర్మించారు.
ఈ ‘రాణి కి వావ్’ చాళుక్య రాజవంశం పాలనలో నిర్మించబడింది . ఇది సరస్వతీ నది ఒడ్డున ఉంది . 1304లో జైన సన్యాసి మేరుతుంగచే స్వరపరచబడిన ప్రబంధ-చింతామణి ఇలా పేర్కొంది: “నరవరాహ ఖెంగార కుమార్తె ఉదయమతి, సహస్రలింగ తటాకం కంటే గొప్ప వైభవంగా శ్రీపట్టణ (పటాన్) వద్ద ఈ నవల మెట్ల బావిని 1063 లో ప్రారంభించబడి 20 సంవత్సరాల తరువాత పూర్తయింది అని దానిలో ఉంది. ఇది భీమ రాజుగారి జ్ఞాపకార్థం అతని రాణి ఉదయమతిచే నిర్మించబడిందని ఉంది.
ఈ మెట్లబావి తరువాత కాలంలో సరస్వతి నదికి వచ్చిన వరదలు కారణంగా పూర్తిగా మట్టి, బురదతో నిండిపోయింది. 1890లలో బ్రిటీష్ పురాతత్వ శాస్త్రవేత్తలు అయిన హెన్రీ కౌసెన్స్ మరియు జేమ్స్ బర్గెస్ దీనిని చూసి, బావి షాఫ్ట్ మరియు కొన్ని స్తంభాలు మాత్రమే కనిపించాయి అని చెప్పారు. వారు దీనిని 87 మీటర్లు (285 అడుగులు) లోతు భారీ గొయ్యిగా మాత్రమే అభివర్ణించారు. అయితే 1940లలో, అప్పటి బరోడా స్టేట్ జరిపిన త్రవ్వకాల్లో ఈ మెట్ల బావిని గుర్తించారు. చివరిగా మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ద్వారా 1981 నుండి 1987 వరకు తవ్వకాలు మరియు పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది . ఈ తవ్వకాల్లో రాణీ ఉదయమతి చిత్రం కూడా లభించింది. ఇది 22 జూన్ 2014న UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడింది.
రాణీ కి వావ్ గురించి మరిన్ని వివరాలు:
1. ముఖ్యంగా అసలు నిర్మాణ ఆలోచనే అద్భుతం. మన దేవాలయాన్ని తిరగేసి అంటే ఇంగ్లీషు ‘V’ ఆకారంలో భూమిలో నిర్మిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. 7 అంతస్తుల తో దీని నిర్మాణం సరిగ్గా అలాగే చేశారు
2. ఇది 92 అడుగుల లోతు, పైన 213 అడుగుల పొడుగు, 66 అడుగుల వెడల్పు తో నిర్మించారు.పూర్తి దిగువున బావి తవ్వారు.
3. ఈ బావి ప్రతీ అంతస్థులో భారీ స్తంభాలు ఆధారంగా మండపాలు నిర్మించారు. వీటిల్లో స్తంభాలు, గోడలు, పై కప్పులు పూర్తిగా చెక్కిన శిల్పాలు డిజైన్లు తో నింపేశారు. ఈ మెట్ల బావిలో మొత్తం ఇటువంటి వి 212 స్తంభాలు ఉన్నాయి.
4. ఈ శిల్పాలలో అన్ని హిందూ దేవీ దేవతల అంటే బ్రహ్మ , విష్ణువు , శివుడు , గణేశుడు , కుబేరుడు , లకులీశ , భైరవుడు , సూర్యుడు , ఇంద్రుడు మరియు హయగ్రీవుడు, లక్ష్మీ , పార్వతి , సరస్వతి , చాముండ , క్షేమంకరి, సూర్యాణి, సప్తమాత్రికలు మరియు దుర్గ వంటి దేవీదేవతల శిల్పాలు ఉన్నాయి. విష్ణువుకి సంబంధం ఉన్న శిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. శిల్పలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి
శేషశాయి విష్ణువు, విష్ణువు యొక్క విశ్వ రూపం, దశావతారాలు, నాగ కన్యలు, అప్సరసలు మొ. ఉన్నాయి.
5. దేవీ దేవతలకు చెందిన శిల్పాలు మాత్రమే కాకుండా వివిధ జంతువుల, పక్షుల, జలచరాల, వృక్షాలకు చెందిన శిల్పాలు ఉన్నాయి.
6. అంతే కాక అక్కడ స్థానిక చేతి వృత్తులు వారు బట్టల మీద వివిధ వస్తువుల చిత్రీకరించే రక రకాల గణిత రేఖాచిత్రాలు, డిజైన్లు అక్కడ చెక్కిన శిల్పలలో చూడవచ్చు.
7. ఆ ప్రాంతంలో ఆ నాటి సంస్కృతి ప్రతిబింబించే శిల్పాలు కూడా చాలా వున్నాయి. అంటే స్త్రీలు తల దువ్వుకోవడం, వివిధ అలంకరణలు చేసుకోవడం, సేవకులతో పరిచర్యలు చేయించు కోవడం, నృత్య భంగిమలు మొదలగునవి ఉన్నాయి.
8. అన్నిటి కంటే ఆశ్చర్యం కలిగించే శిల్పంస్నానం చేసి తడి వెంట్రుకలతో ఉన్న ఒక యువతి జుట్టు నుండి రాలుతున్న ముత్యాల వంటి నీటి బిందువులను మరొక యువతి పట్టుకుంటూ ఉండటం కనిపిస్తుంది. ఈ శిల్పాలలో స్త్రీలు కంకణాలు, చెవిపోగులు, హారాలు, నడుము నడికట్టు, చీలమండలు, సొగసైన బట్టలు, చక్కగా బాగా దువ్విన జుట్టు, వివిధ డిజైన్లు లో నగలు కనిపిస్తాయి. అనేక రకాల వ్యక్తీకరణలు మరియు భావోద్వేగాలు ఈ శిల్పలలో చాలా బాగా వ్యక్తీకరించబడ్డాయి.
9. సుమారు 500 కంటే ఎక్కువగా ప్రధాన శిల్పాలు ఉంటే వెయ్యికి పైగా చిన్నవి ఉన్నాయి,
గుజరాత్ యాత్రలకు వెళ్లేవారు తప్పక చూడవలసిన అద్భుతమైన నిర్మాణం ఇది.