గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్’ రిలీజ్ డేట్ లాక్డ్

IMG 20241016 WA0061 scaled e1729073509426

ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘మ్యాజిక్‌’ అనే సినిమాను సితార రూపొందిస్తోంది.

ఈ మ్యూజికల్ డ్రామాలో ఎందరో నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

‘మ్యాజిక్‌’ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరకర్తగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ పుట్టినరోజు సందర్భంగా, నిర్మాతలు చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21, 2024న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఎంతో సృజనాత్మకంగా ఉంది.

తమ కాలేజీ ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో యువతను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. కల నెరవేరాలంటే మొదట ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాన్ని అందమైన ప్రయాణంలా చూపించే ‘మ్యాజిక్’ చిత్రం, థియేటర్లలో ప్రేక్షకులను మాయ చేయనుంది.

ప్రముఖ ఛాయాగ్రాహకుడు గిరీష్ గంగాధరన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ‘మ్యాజిక్’ చిత్రానికి, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *