డిసెంబర్ లో ‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ సినిమా విడుదల !

ghantasaala biofic 2 e1688235820531

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. టైటిల్‌ పాత్రలో యువ గాయకుడు కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రి పాత్రలో మృదుల నటించారు. అన్యుక్తరామ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌‌ పతాకంపై శ్రీమతి ఫణి నిర్మాతగా, గాయకుడు జి.వి భాస్కర్‌ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.

‘ఘంటసాల పాటశాల’ సంకలన కర్త సి.హెచ్‌. రామారావు దర్శకత్వం వహించారు. షూటింగ్‌ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను ఫిల్మ్‌ చాంబర్‌లో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించారు.

ghantasaala biofic 1

ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ఘంటసాల అనగానే మనందరి ఒళ్లు పులకరిస్తుంది. మన నరనరాన ఆయన పేరు ఉండిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి కథతో, ఘంటసాలగారి మీద ఉన్న అభిమానంతో దర్శకుడు రామారావు ఈ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి నిర్మాతలు చక్కని సహకారం అందించారు. ఘంటసాల గారి మీద మనకున్న అభిమానాన్ని చూపించాలంటే ఈ సినిమాను సూపర్‌హిట్‌ చేయాలని ఫిల్మ్‌ ఇండస్ట్రీ తరఫున ప్రేక్షకులు అందరినీ కోరుతున్నా. టైటిల్‌ పాత్ర పోషించిన గాయకుడు కృష్ణ చైతన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్‌. దామోదర్ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ మధ్యకాలంలో చాలా బయోపిక్‌లు వస్తున్నాయి. అసలు తీయాల్సింది ఘంటసాల గారిది. లేట్‌ అయినా గానీ మంచి ప్రయత్నం చేశారు. చరిత్రను ఈ జనరేషన్‌ తెలియజేయడం చాలా అవసరం’’ అని అన్నారు.

ghantasaala biofic 4

నిర్మాతల మండలి కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘సినిమా తీయడం ఎంతో కష్టం. బయోపిక్‌ అంటే మరీ కష్టం. అప్పటి స్మృతులను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాలి. రామారావుగారు ఆ విషయంలో వంద శాతం న్యాయం చేశారు. నేనూ ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించా. ఇది మనందరి సినిమా. ఫిల్మ్‌ ఇండస్ట్రీ సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి అత్యధిక సంఖ్యలో థియేటర్లు ఇచ్చి సహకరించాలి. మేం కూడా ఆ దిఽశగా సాయం అందిస్తాం’’ అని చెప్పారు.

నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఘంటసాలగారి పాట భూమి, ఆకాశాలు ఉన్నంతకాలం చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. ఆయన భౌతికంగా లేకపోయిన ఆయన పాటలు ప్రపంచం మొత్తం మార్మోగుతూనే ఉంటాయి. భావితరాలకు ఆయన చరిత్ర తెలియ చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆయన చరిత్రను పుస్తకాల్లో సిలబస్‌గా ఉంచడం ప్రభుత్వాల బాధ్యత. ఘంటసాల గారికి రావల్సిన గుర్తింపు చాలా ఉంది’’ అని అన్నారు.

ghantasaala biofic 4

ఘంటసాల పాత్రధారి కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘‘ఘంటసాల పాత్ర పోషించడం ఓ గాయకుడిగా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచానికి ఆయన గాయకుడిగానే తెలుసు. ఆయన ఎదుగుదలలో ఎదురైన ఆటుపోట్లు, ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి’’ అని తెలిపారు.

చిత్ర నిర్మాణ సారథి జి.వి. భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘2018లో ఈ సినిమా టీజర్‌ను ఎస్‌.పి.బాలుగారి చేత విడుదల చేయించి ఎంతో పేరు సంపాదించాం. తదుపరి పలు కారణాల వల్ల ఘంటసాల కుటుంబంతో లీగల్‌గా చిన్నచిన్న సమస్యలొచ్చాయి. అవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆయన కుటుంబం నుంచి మంచి సపోర్ట్‌ లభిస్తోంది. ఈ సినిమా విషయంలో లక్ష్మీ ప్రసాద్‌, మాధవపెద్ది సురేష్‌గారు అందించిన సహకారం మరువలేనిది. త్వరలో ప్రమోషన్‌ స్టార్ట్‌ చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.

ghantasaala biofic 6

చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచవ్యాప్తంగా ఘంటసాలగారికి అభిమానులున్నారు. ఈ సినిమా పెద్ద స్థాయిలో జనాలకు చేరువవుతుంది. ఈ సినిమా సక్సెస్‌ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. లీగల్‌ సమస్యల వల్ల సినిమా డిలే అయింది. ఇప్పుడు అలాంటి సమస్యలేమీ లేవు’’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు సిహెచ్ రామారావు మాట్లాడుతూ ”దర్శకుడిగా నా మొదటి చిత్రమిది. నేను అభిమానించే ఘంటసాల గారి జీవిత కథతో సినిమా తీసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది పాట. మహాగాయకులు అంటే అన్నమయ్య, రామదాసు, ఒక ఘంటసాల అని భావిస్తుంటారు. అన్నమయ్య, రామదాసులపై రాఘవేంద్రరావుగారు సినిమాలు తీశారు. మూడో వ్యకి ఘంటసాలగారిపై సినిమా తీసే అవకాశం నాకు దక్కింది. ఘంటసాల పాట అంటే అందరికీ ఇష్టమే కానీ ఆ పాట కోసం ఆయన ఎంత కష్టపడ్డారో చాలామందికి తెలీదు.

ghantasaala biofic

అలాంటి ఎన్నో విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నాం. గాయకుడి కన్నా ఆయన వ్యక్తిగతంగా ఎంతో మంచి మనిషి. ఆయన జీవితంతో ఎంత పోరాటం చేశారో.. ఈ సినిమా ప్రయాణంలో నేనూ అంతే కష్టపడ్డా. మా టీమ్‌ అందరి కృషితో సినిమా విడుదల వరకూ వచ్చాం. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ఘంటసాలగా కృష్ణ చైతన్య కరెక్ట్‌గా సరిపోయాడని ఎస్‌పి బాలుగారు చెప్పారు. అదే మా తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో దర్శకులు బాబ్జి, బాలాజీ కర్రి తదితరులు పాల్గొన్నారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

కృష్ణ చైతన్య, మృదుల, సుమన్, సుబ్బరాయ శర్మ, దీక్షిత్ మాస్టర్, జె.కె. భారవి, అశోక్ కుమార్, మాస్టర్ అతులిత్ (చిన్న ఘంటసాల), సాయి కిరణ్, అనంత్‌, గుండు సుదర్శన్‌, జి.వి.భాస్కర్‌, దీక్షితులు,
జయవాణి ఈ చిత్రంలో ప్రధాన తారాగణం.

ghantasaala biofic 5

ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ : శ్యామ్‌ కుమార్‌. పి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు మురళీధర్. వి, ఎడిటింగ్: క్రాంతి (RK), ఆర్ట్: నాని, సహ నిర్మాత: జి.వి. భాస్కర్, సంగీతం : వాసూరావు సాలూరి,‌‌‌‌‌ నిర్మాణం : అన్యుక్త్‌ రామ్‌ పిక్చర్స్‌, నిర్మాత: శ్రీమతి ఫణి, రచన – దర్శకత్వం: సిహెచ్. రామారావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *