Gangs.of Godavari Movie Mass Song Motha Viral: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సాంగ్ మాస్ ‘మోత’ !

IMG 20240325 WA0090 e1711361430300

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమాల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, పలు విజయాలను ఖాతాలో వేసుకొని, ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే మరో వైవిధ్యమైన సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయన మాస్ ని మెప్పించే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇటీవల విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుండి విడుదలైన ”సుట్టంలా సూసి” మెలోడీ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట యూట్యూబ్‌లో దాదాపు 50 మిలియన్ల వీక్షణలతో చార్ట్ బస్టర్ గా నిలిచింది.

IMG 20240325 WA0140

ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా నుండి “మోత” అనే మరో ఆకర్షణీయమైన పాటను విడుదల చేసింది. యువన్ శంకర్ రాజా తనదైన శైలిలో మాస్ ని మెప్పించేలా ఈ పాటను స్వరపరిచారు. అభిమానుల్లో ఉత్సాహం నింపేలా ఉన్న ఈ పాట.. థియేటర్లలో మోత మోగించడం ఖాయం అనేలా ఉంది.

ప్రముఖ గీత రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం ఈ పాటని మరోస్థాయికి తీసుకెళ్లింది. పాట సందర్భానికి తగ్గట్టుగా పదాల అల్లికతో మరోసారి మాయ చేశారు. అలాగే ఎం.ఎం. మానసి గాత్రం ఈ గీతానికి మరింత అందం తీసుకొచ్చింది.

హోలీ రోజున “మోత” పాటను విడుదల చేసి, పండగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది చిత్ర బృందం. ఇక అందాల తార అయేషా ఖాన్ ఈ ప్రత్యేక పాట కోసం విశ్వక్ సేన్‌తో కలిసి తెరను పంచుకోవడం అదనపు ఆకర్షణ.

IMG 20240325 WA0096

అయేషా ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు ఎనర్జీ సినీ ప్రేమికులందరికీ ప్రత్యేక ట్రీట్ లా ఉండనుంది. ఈ చిత్రంలో అందాల నటి నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, ప్రతిభగల నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనిత్ మధాడి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకి కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్నారు. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తి యొక్క ప్రయాణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

ఈ సినిమా మే 17, 2024న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రం ఈ ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందిస్తుందని నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *