Dulquer Salmaan Venky Atluri’s Lucky Bhaskar teaser Out: దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ మూవీ టీజర్ ఎలా ఉందంటే!

IMG 20240411 WA0155 e1712832467390

వివిధ భాషల్లో, విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి ఘన విజయాలతో తెలుగులోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన ‘లక్కీ భాస్కర్’ అనే బహుభాషా చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.

‘లక్కీ భాస్కర్’ సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఏప్రిల్ 11న రంజాన్ ను పురస్కరించుకుని తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు నిర్మాతలు.

ఒక సాధారణ వ్యక్తి, అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే ఆసక్తిని రేకెత్తిస్తూ రూపొందించిన టీజర్ ఆకట్టుకుంటోంది. ఒక మధ్యతరగతి వ్యక్తి, భారీ మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాడు? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ప్రశ్నలతో టీజర్ ని మలిచిన తీరు మెప్పించింది. అలాగే టీజర్ లో దుల్కర్ సల్మాన్ పలికిన సంభాషణలు, కెమెరా పనితనం, నేపథ్య సంగీతం కట్టిపడేశాయి.

IMG 20240411 WA0111

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన ‘సార్/వాతి’ వంటి ఘన విజయం తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ రూపొందిస్తున్న సినిమా కావడం విశేషం.

తన అందం, అభినయంతో యువతకు ఎంతగానో చేరువైన మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా నటిస్తున్నారు.

‘లక్కీ భాస్కర్’ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి కళా దర్శకుడిగా బంగ్లాన్, ఎడిటర్ గా నవీన్ నూలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టీజర్‌ లోనే తనదైన నేపథ్య సంగీతంతో మెప్పించి, చిత్రంలో సంగీతం ఏ స్థాయిలో ఉండబోతుందో తెలియజేశారు.

‘లక్కీ భాస్కర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *