Aadikeshava Release Press meet Highlights: ఎమోషన్, యాక్షన్ తో కూడిన కమర్షియల్ చిత్రం ‘ఆదికేశవ’: చిత్ర బృందం

IMG 20231122 WA0203 e1700673869600

 

అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆనందించదగ్గ పక్కా కమర్షియల్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీ చేయడం కోసం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ‘ఆదికేశవ’. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

IMG 20231122 WA0091

ప్రచార చిత్రాలు, జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి. బుధవారం సాయంత్రం ఈ మూవీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ఆదికేశవ’ విశేషాలను పంచుకోవడంతో పాటు, సినిమా విజయం పట్ల నమ్మకం వ్యక్తం చేసింది.

అనంతరం విలేఖర్లు అడిగిన ప్రశ్నలకు కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి సమాధానమిచ్చారు.

IMG 20231122 WA0067

కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ, “ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు ఓ మంచి సినిమా చూశామనే ఆనందంతో థియేటర్ల నుంచి బయటకు వస్తారు.

పతాక సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఛాలెంజింగ్ గా అనిపించింది. టీం అందరం కష్టపడి పనిచేశాం. యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించాం. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పదిమంది ఎరిగిపోయే తరహా ఫైట్లు ఉండవు.

IMG 20231122 WA0204

నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి. అవుట్ పుట్ మా అందరికీ చాలా బాగా నచ్చింది. సినిమా పట్ల టీం అంతా ఎంతో నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చుతుందని భావిస్తున్నాం.” అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. విడుదలకు ముందురోజు సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నాం. మొదటి షో తిరుపతిలోని సంధ్య థియేటర్ లో మొదలవుతుంది. ముందు రోజే షోలు వేయాలని నిర్ణయం తీసుకున్నామంటే ఈ సినిమా పట్ల మేము ఎంత నమ్మకంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. రోజురోజుకి ఆదికేశవ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. సోషల్ మీడియా రీల్స్ లో కూడా ఈ సినిమాలోని పాటలు మారుమోగిపోతున్నాయి.” అన్నారు.

దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ, “కథ విని సినిమా చేయడానికి అంగీకరించిన వైష్ణవ్ గారికి, నాగవంశీ గారికి, చినబాబు(ఎస్. రాధాకృష్ణ) గారికి, త్రివిక్రమ్ గారికి ధన్యవాదాలు. ఓ కొత్త దర్శకుడిని నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. కొత్తవారికి ఇది అవకాశం ఇచ్చినట్లు కాదు.. జీవితం ఇచ్చినట్లు. జి.వి. ప్రకాష్ గారు అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారు.

IMG 20231122 WA0061

పాటలు అద్భుతంగా రాసిన కాసర్ల శ్యామ్ గారికి, రామజోగయ్య శాస్త్రి గారికి, అలాగే పాటలు కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు నేను రాసుకున్న యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఎడిటర్ నవీన్ నూలి గారు ఇంకా బెటర్ చేద్దాం అంటూ చివరి వరకు పనిచేస్తూనే ఉన్నారు. డీఓపీ డడ్లీ గారికి, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి, డీఐ దగ్గరుండి చూసుకున్న ప్రసాద్ గారికి థాంక్స్. నాకు కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఇది కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ సరిగ్గా కుదిరిన కమర్షియల్ సినిమా.” అని అన్నారు.

 

నటులు జయప్రకాశ్, సుదర్శన్, రచ్చ రవి, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *