చిత్రం: సత్యం సుందరం,
విడుదల తేదీ : 28-09- 2024,
నటీనటులు : కార్తీ, అరవింద్ స్వామి, శ్రీ దివ్య, దేవదర్శిని, స్వాతి కొండే, జయ ప్రకాష్, రాజ్ కిరణ్ తదితరులు..,
దర్శకుడు : సి. ప్రేమ్ కుమార్,
నిర్మాతలు : జ్యోతిక సదన, సూర్య శివకుమార్,
సంగీత దర్శకుడు : గోవింద్ వసంత,
సినిమాటోగ్రఫీ : మహేంద్రన్ జయరాజు,
ఎడిటర్ : ఆర్.గోవిందరాజ్,
మూవీ:సత్యం సుందరం రివ్యూ ( Satyam Sundaram Movie Review)
వెర్సటైల్ నటులు కార్తీ, అరవింద స్వామి కలిసి నటించిన కాదు కాదు కలిసి జీవించిన ఎమోషనల్ విలేజ్ డ్రామా చిత్రం “సత్యం సుందరం” (Tamil Version Meiyazhagan) తమిళ వెర్షన్ ఈ శుక్రవారమే విడుదలైన తెలుగు లో దేవర కారణంగా ఒకరోజు ఆలస్యంగా అంటే ఈ శనివారం విడుదల అయ్యింది.
తమిళ 96 సినిమా (తెలుగు లో జాను) కి దర్శకుడు అయిన ప్రేమ్ కుమార్ ఈ సత్యం సుందరం సినిమా కు కూడా రచన దర్శకత్వ భాద్యతలు తీసుకొన్నాడు. టీజర్, ట్రైలర్ లతో మెప్పించి ఈ చిత్రం ఎలా ఉందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
గుంటూరులో ఉండే రామలింగం (జయప్రకాశ్) కొడుకు సత్యమూర్తి (అరవింద స్వామి) కి తన చిన్న నాటి నుంచి ఉన్న తరతరాల సొంత ఇల్లు, పల్లేటూరి వాతావరణం అక్కడి పిల్లలతో ఆటలు అంటే ఎంతో ఇష్టం. బంధువుల మధ్య ఆస్తి గొడవల్లో సత్యం తండ్రి రామలింగం మూడు తరాలుగా నివసిస్తున్న తమ పూర్వీకుల ఇంటిని కోల్పోయి సొంతూరు వదిలేసి విశాఖకు వలస వెళతారు.
1996లో విశాఖకు వచ్చేసిన సత్యం,సుమారుగా ఇరవై రెండు ఏళ్ళుగా తన బంధువులకు, పల్లెటూరికి దూరంగా సిటీ లో యాంత్రిక జీవితం గడుపుతూ తన లోకంలో ఉన్న సత్యంకి తప్పనిసరి పరిస్థితుల్లో చిన్నాన్న కుమార్తె భువన (స్వాతి కొండె) వివాహానికి తన సొంతూరుకు మనసులో వెళ్లాలని ఉన్నా ఇష్టం లేకుండానే వెళ్లాల్సి వస్తుంది.
అక్కడ బావా అంటూ తనను తాను పరిచయం చేసుకుంటాడు ఓ వ్యక్తి (కార్తీ). సత్యమూర్తిని అసలు వదిలిపెట్టడు. చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నిటినీ చెబుతూ ఉంటాడు. తనను బావా అంటున్నది ఎవరో సత్యమూర్తికి గుర్తు కి రాదు, పేరు కూడా తెలియదు. అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అనివార్య కారణాల వలన చివరకు అతని ఇంటిలో ఓ రాత్రి ఉండాల్సి వస్తుంది.
సత్యా ని బావా అంటున్న ఆ పరిచయం లేని వ్యక్తి పేరు ఏమిటి?
సత్యం, ఆ పరిచయం లేని వ్యక్తి మద్య ప్రయాణం ఎలా సాగింది?
సత్యంకి మొదట్లో చికాకుగా అనిపించినా అతనికి ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అయ్యాడు ?,
తనకి ఎవరో తెలియని వ్యక్తి తో సత్యం ఎలా ఉండగలిగాడు?
ఆ పరిచయం లేని వ్యక్తి ఫ్యామిలీ ద్వారా సత్యమూర్తి ఏం తెలుసుకున్నాడు?
కార్తీ జీవితంలో సత్య (మూర్తి) వల్ల వచ్చిన మార్పులు ఏమిటి?
కార్తీ తనకు పుట్టబోయే బిడ్డకు సత్య పేరును ఎందుకు పెట్టుకోవాలనుకొంటాడు?
చివరకు సత్య కి ఆ పరిచయం లేని వ్యక్తి పేరు ఎలా తెలిసింది ?
వంటి ప్రశ్నలకు జవాబులు తెలియనంటే మీ దగ్గరలొని థియేటర్ కి వెళ్ళి వెంటనే సినిమా చూడండి. ఈ కధ సినిమా కధ గా కన్నా మన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. కొన్ని సీన్స్ లో అయితే కళ్ళు చెమ్మగిల్లి, పని వత్తిడిలో మచ్చిపోయిన అనుభనధలను జ్ఞాపకం చేస్తూ నిత్యం మనం పుట్టిన ఊరిలోని బంధువులు స్నేహితులతో గడపాలనిపిస్తుంది.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
ఈ సత్యం సుందరం చిత్రం కధ గా కాకుండా జీవిత ప్రయాణంగా సాగిపోయే పాయింట్ కి తగ్గ కధనం ( స్క్రీన్ – ప్లే) కూడా కుదిరింది అని చెప్పవచ్చు. స్వచ్ఛమైన పల్లేటూరి మనషుల మద్య నడిచే సన్నివేశాలలో హృదయాన్ని అఅట్టుకొనే అంశాలు చాలా ఉన్నాయి కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం స్లో గా సాగినట్టు అనిపించాయి.
ముఖ్యంగా సీనియర్ నటుడు రాజ్ కిరణ్ పై ఉన్న కొన్ని సన్నివేశాలు, పెళ్లి బోజనాల సన్నివేశాల నిడివి మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. సినిమా మొదటి అర్ద గంట లోని కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ డెప్త్ కోసం కొంచెం సాగదీసిన భావన కూడా కలిగించవచ్చు. ఇలాంటి కొన్ని సన్నివేశాలు ఇప్పటి పట్టణ యువతకి కనెక్ట్ కాకపోవచ్చు.
అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ అయిన ఐటం సాంగ్ లు, ఫైట్స్ వంటి వాటిని ఆశించే వారిని మన సత్యం సుందరం నిరాశ పరచవచ్చు. ఏ హంగులు లేకుండా మన పల్లేటూరి మనుషుల స్వచ్ఛమైన ప్రేమలతో కూడిన కధ- కధనం కావాలనుకొనే వారికి మంచి పల్లేటూరి విందు భోజనం లాంటి సినిమా ఈ సత్యం సుందరం.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు సి ప్రేమ్ కుమార్ విషయానికి వస్తే.. స్వతహాగా తను సినిమాటోగ్రఫీ లో తన సినీ ప్రయాణం మొదలుపెట్టి కొన్ని సినిమాలకు DoP గా పనిచేసి కొంత విరామం తర్వాత 96 అనే ఎమోషనల్ కధ రాసుకొని తానే దర్శకత్వం చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నాడు.
96 లాంటి ఎమోషనల్ డ్రామాని ఇచ్చిన తన రాసుకొన్న ఈ రెండో కధ కూడా మంచి ఎమోషనల్ జర్నీ తో కూడిన మరో బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. కేవలం కొన్ని సీన్స్ స్లోగా అనిపించాయి తప్పితే మిగతా కథనం కానీ తాను చూపించిన ఎమోషన్స్ కానీ సినిమాలో చాలా బాగున్నాయి. హృదయాన్ని హత్తుకుంటాయి. సినిమాలో కనిపించే నటీనటుల్ని చూస్తే మనలోనో మన ఊర్లోనో చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా సినిమాని మాత్రం మంచి ఎమోషన్స్ తో తాను తీసుకెళ్లారు.
వర్సటైల్ నటుడు కార్తీ తన కెరీర్లో చాలా సహజమైన సినిమాలగా తనదైన నాచురల్ పెర్ఫామెన్స్ తో నటించాడు. కార్తీ చేసిన అన్ని పల్లెటూరు నేపథ్యం ఉన్న సినిమాల పాత్రలు దేనికదే వైవిద్యంగా ఉంటూ చాలా సహజంగా ఉంటాయి. అలా తన నుంచి వచ్చిన మరో అందమైన పల్లెటూరి సినిమా ఇది కూడా అని చెప్పవచ్చు.
కార్తీ ఎమోషనల్ పెర్ఫామెన్స్ అయితే తన ఫ్యాన్స్ ని న్యూట్రల్ ఆడియెన్స్ ని కూడా ఎంతో భావోద్వేగానికి లోను చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. తన పాత్రలోని అమాయకత్వం, మాటకారితనం తన లుక్స్ తో సుందరం అనే పాత్రకి కార్తీ ప్రాణం పోసాడని చెప్పాలి.
అరవింద స్వామి పాత్ర కూడా ఆద్యంతం సినిమాలో సాగే మరో ముఖ్య పాత్ర. తనదైన సహజ నటనతో ఎంతో భావోద్వేగానికి లోను చేసే సన్నివేశాలలో కూడా అద్భుతంగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన చెల్లెలికి పెళ్లి మండపం మీద బంగారు ఆభరణాలు తొడిగే సీన్ కానీ సినిమా ప్రీ క్లైమాక్స్ లో తన భార్యతో కార్తీ కోసం చెప్పే సన్నివేశంలో కానీ అరవింద స్వామి ఇచ్చిన ఎమోషనల్ పెర్ఫామెన్స్ అద్భుతంగా అనిపిస్తుంది.
ముఖ్య పాత్రలలో నటించిన శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయ ప్రకాష్, రాజ్ కిరణ్ తదితరులు తమ పాత్రల పరిది మేరకు బాగా చేశారు.
అలాగే అన్ని పాత్రలకు చెప్పించిన తెలుగు డబ్బింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ విషయంలో తెలుగు డబ్బింగ్ టీంకి మంచి మార్కులు ఇస్తూ అభినదించాలి.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ డైలాగ్స్, పాటల లొని సాహిత్య పదాలు చాలా చక్కగా కుదిరాయి.చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా మేకర్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ప్రతి సన్నివేశం లో కనిపించే అన్ని బోర్డులు తెలుగులోనే కనిపించేలా చేశారు. ఇంకా చెప్పాలి అంటే డైరెక్ట్ తెలుగు సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది.
రచయిత – నటుడు రకేందు మౌళి రాసిన మాటలు, పాటల సాహిత్యం వేటూరి, బాపు – రమణ, పెద్ద వంశీ లను గుర్తి చేసేలా ఉన్నాయి. ఎక్కడా తమిళ అనువాదం అని అనిపించదు. గుంటూరు యాస తో పాటు పల్లేటూరి వ్యక్తులు మాట్లాడుకొనే పదాల కోసం మాటల రచయిత తీసుకున్న ప్రతీ చిన్న జాగ్రత్త మాత్రం చాలా బాగుంది.
గోవింద్ వసంత సంగీతం కూడా ఈ సినిమాకి వెన్నుముక అని చెప్పాలి. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా చాలా ఇంపుగా సందర్భానుసారం వచ్చే పాటలు చాలా బాగున్నాయి. సంగీత దర్శకుడు గోవింద్ వసంత అద్భుతమైన ట్యున్స్ ని నేపద్య సంగీతాన్ని అందించారు.
మహేంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీ కూడా సినిమా కి ప్రాణం పోసింది. కలర్ ఫుల్ ఫ్రేమ్ లతో చక్కగా చూపించాడు.
ఆర్.గోవిందరాజ్ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. దాదాపు మూడు గంటల సినిమా అయినా ఎక్కడ బోర్ లేకుండా కట్ చేసిన విధానం బాగుంది.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
“సత్యం సుందరం” అనేది సినిమా కధ కాదు. పల్లేటూరి నుండి పట్నం వచ్చిన ప్రతి ఒక్కరి జీవితం కధ. చాలా ఏళ్లు తర్వాత ఇలాంటి స్వచ్ఛమైన మనసున్న పల్లేటూరి వ్యక్తుల కధను వెండితెర మీద చూసే అదృష్టం కల్పించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ ని, హీరోఇజం పక్కన పెట్టి నటించిన కార్తీ, అరవింద్ స్వామి ని, ఏ కమర్శియల్ హంగులు లేని స్వచ్ఛమైన కధను ఒప్పుకోని నిర్మించిన సూర్య – జ్యోతిక లను అభినంధీంచాలి.
అప్పటి బాలచందర్, కె విశ్వనాధ్ సినిమాలలా ఈ సత్యం సుందరం కూడా చాలా కాలం మనస్సు కి హత్తుకున్న స్వచ్ఛమైన ఎమోషనల్ డ్రామాగా నిలుస్తుంది. ఎలాంటి కమర్శియల్ హంగామా లేకుండా హృదయానికి తేలిక పరిచే మంచి సినిమా చూడాలి అనుకునేవారికి సత్యం సుందరం ఈ వారంలో మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.
అలాగే కుటుంబం, బంధువులు మరియు ఫ్రెండ్స్ తో సహా అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి ఎలాంటి ద్వంద్వ అర్ద – పదాలు, వల్గర్ సన్నివేశాల ఇబ్బంది లేకుండా థియేటర్స్ లో హాయిగా వీక్షించవచ్చు.
చివరి మాట: పల్లేటూరి జ్ఞాపకాలతో కూడిన జీవిత కధ !
18F RATING: 3.75 / 5
* కృష్ణ ప్రగడ.