‘100 పర్సెంట్ లవ్’ చిత్రంతో తో గీతరచయితగా పరిచయమైన శ్రీమణి. తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించు కున్నారు. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్‌హీరో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు శ్రీమణి.
అనతికాలంలోనే టాప్ లిరిక్ రైటర్స్‌ల్లో ఒకరిగా పేరుపొందిన ఈ యువ గీత రచయిత, సెప్టెంబరు 15 సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తన కెరీర్ విషయాలను మా 18F మూవీస్ మీడియా ప్రతినిథితో పంచుకున్నారు శ్రీమణి.
ఆ విశేషాలలోని కొన్ని ముఖ్య విషయాలు మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము..
ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమైనా ఉందా?
ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కాకపోతే నా సాహిత్యపు జర్నీలో మరో మెట్టు ఎక్కాలని.. కొత్త అఛీవ్‌మెంట్ సాధించాలి అదే నా లక్ష్యం. ఈ రోజే నా లైఫ్ మొదలైంది అనే భావనతో కొత్త కొత్త పనులు చేయాలని.. ఆ పనులను పుట్టినరోజు నాడే ఆరంభం కావాలని కోరుకుంటాను.
ఈ సంవత్సరం మీరు సాహిత్యం అందించిన పాటలు మీకు ఎలాంటి సంతృప్తి నిచ్చాయి?
సాహిత్య పరంగా లోతైన సన్నివేశాలకు సాంగ్‌లు అందించే అవకాశం నాకు లభించింది. ముఖ్యంగా తండేల్‌లో బుజ్జితల్లి, హైలెస్సా పాటలతో పాటు లక్కీ భాస్కర్‌లోని నిజమా కలా, ఆయ్ సినిమాలోని పాటలు నాకు మంచి నాకు పేరును తెచ్చిపెట్టాయి. ఈ పాటలన్నీ కథలో ఉన్న సన్నవేశం తాలూకా లోతైన భావం చెప్పడమే. ఇలాంటి పాటలు రాసే అవకాశం రావడం గర్వంగా ఉంది.
ఈ సందర్భంగా నేను ఈ పాటలను రాయగలను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులకు, దర్శక, నిర్మాతలకు కృతజ్క్షతలు తెలియజేస్తున్నాను.
మీ సినీ గీత రచన ప్రయాణంలో సాహిత్య పరంగా వచ్చిన మార్పులు ఏంటి ? పాటను ఎంత వరకు చాలెంజ్ గా తీసుకుంటారు:?
నాకు ప్రతి పాటకు ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది. గత ఐదు సంవత్సరాల కాలంలో సంగీతంతో పాటు సాహిత్యంలో సౌండ్ డిజైనింగ్ మారింది. శబ్ధ సౌందర్యం ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉండాలి.
అందుకే నేను ట్రెండ్‌కు తగ్గట్టుగా, స్టాండర్స్ మిస్ అవ్వకుండా, పాటకు కాలపరిమితి లేకుండా అంటే పదేళ్ల తరువాత కూడా సాహిత్యం ప్రెష్‌గా అనిపించేలా ప్రయత్నిస్తుంటాను. ఆ ప్రయత్నంలో భాగంగానే నన్ను నేను మార్చుకుంటాను.
మీరు ప్రేమ పాటలు చాలా ఎక్కువగా రాస్తుంటారు? ప్రతి పాటలో కొత్తదనం ఎలా చూపిస్తారు?
ప్రేమ అనేది యూనివర్శల్. ప్రతి పాటలో, భావంలో కొత్తదనం దొరుకుతుంది. కొత్త ఎక్స్‌ప్రేషన్ ఉంటుంది. పాట సున్నితపదాలతో అందరికి అర్థమయ్యేలా ఎమోషన్ మిస్ అవ్వకుండా రాయడం.. శబ్దంలో అర్థం ఉండేలా చూసుకోవడం చేస్తుంటాను.
ఇప్పటి వరకు మీరు రాసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది?
అన్ని పాటలు ఇష్టపడే రాస్తాను. నేను రాసిన ప్రతి పాట నాకు ఫేవరేటే. రచయితకు ఎప్పుడూ సంతృప్తి ఉండాలి. ఎప్పుడూ ఇంకా రాయాలి.. ఇంకా కొత్త సాహిత్యం అందించాలనే కోరుకుంటాడు.
ప్రస్తుత సోషల్ మీడియా ట్రెండ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి?
ఇది రచయింతలందరికి కత్తి మీద సాము లాంటింది. ఇంతకు ముందు పాట రీచ్ అవ్వడానికి టైమ్ పట్టేది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో వినగానే నచ్చేయాలి అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అందుకే తగ్గట్టుగానే పాటలు ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌లుగా నిలుస్తున్నాయి. అయితే ఇదే పాటను పది సంవత్సరాల తరువాత కూడా సేమ్ ఫీలింగ్ ఉండాలి అనే భావనతో అందరం పాటలు రాస్తున్నాం
ప్రతి సినిమాకి పాటలు రాయడానికి మీరు కథ మొత్తం వింటారా?
అరడుగుల బుల్లెట్ పాట తరువాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌లు రాసే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ఎక్కడ ఎక్కడ సాంగ్ తరువాత ప్రేమ పాటలు అవకాశాలు వచ్చాయి. మహర్షిలో ఇదే కద.. అనే పాటను కథ మొత్తం విని రాశాను. కొన్ని సాంగ్స్ సిట్యుయేషన్‌తో రాస్తాను.
మీరు ఇప్పటి వరకు రాసిన పాటల్లో గర్వపడే పాట అంటే ఏమీ చెబుతారు?
నేను గర్వపడే పాటను నేను నిర్ణయించలేను. మనం రాసిన పాట గురించి మనం గౌరవించే వ్యక్తులు, ఆరాధించే వ్యక్తులు గొప్పగా చెప్పినప్పుడు బాగా సంతృప్తి దొరుకుతుంది. నన్ను గేయ రచయితగా పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ గారు ‘గీతా గోవిందం’ సినిమాలో వచ్చిందమ్మా పాట గురించి బాగా మెచ్చుకున్నారు. బాగా రాస్తున్నావు అని ఎంకరేజ్ చేశారు.
నన్ను ఇండస్గ్రీకి పరిచయం చేసిన వ్యక్తి నన్ను అభినందించడం నాకు గొప్పగా అనిపించింది. మహర్షి పాట విని సిరివెన్నెల సీతరామశాస్త్రి లాంటి గొప్ప వ్యక్తి అభినందించడం నా జీవితంలో మరిచిపోలేను. ఇలాంటి సమయాల్లో గొప్ప పాటను రాశాననే భావన కలుగుతుంది.
పాటల రచయితగా కాకుండా మీకు దర్శకత్వం వైపు కూడా ఆలోచన ఉందా?
దర్శకత్వం వైపు నాకు ఆలోచన లేదు. కానీ పరిపూర్ణ రచయితగా ఎదగాలి అనేది నా బలమైన కోరిక. ఇంతకు ముందు నేను తెలిసిన మిత్రులతో కలిసి కథా చర్చల్లో పాల్గొనేవాడిని. అందుకే దానిని ఆచరణలోకి తీసుకవచ్చి సంభాషణలు రాయాలని ఉంది. రచన అంటే నాకు ప్రాణం. సాహిత్యం విలువ పెంచాలి అనేది నా కోరిక.
ప్రస్తుతం మీరు పాటలు అందిస్తున్న చిత్రాలు ఏంటి ?
దుల్కార్‌సల్మాన్ ‘ఆకాశంలో ఓ తార’ చిత్రంతో పాటు సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు, ఇండియా హౌస్ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలకు సాహిత్యం అందిస్తున్నాను.
ఓకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ శ్రీమణి గారు,
* కృష్ణ ప్రగడ.