విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ల VD12″ విడుదల తేదీని ప్రకటించిన సితార !

IMG 20240802 WA0088 e1722592901335

 అభిమానులు రౌడీ అని అభిమానంతో పిలుచుకొనే విజయ్ దేవరకొండ, తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో స్టార్‌గా ఎదగడమే కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది.

అలాంటి విజయ్, ‘మళ్ళీరావా’, ‘జెర్సీ’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరితో చేతులు కలిపారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అందరినీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

‘VD12’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘VD12’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా, ఎక్కడా రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో, అవిశ్రాంతంగా పని చేస్తోంది చిత్ర బృందం.

ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలోని సుందరమైన ప్రదేశాల్లో జరిగింది. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ క్రమంలో చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. 2025, మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులో ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.

సంచలన స్వరకర్త, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ తో పాటు, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.

సాంకేతిక వర్గం:

రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి, సంగీతం: అనిరుధ్ రవిచందర్ , ఛాయాగ్రహణం: గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్, కూర్పు: నవీన్ నూలి , కళా దర్శకుడు: అవినాష్ కొల్లా , నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, నిర్మాణ సంస్థ: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ .

విడుదల తేది: మార్చి 28, 2025

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *