నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 7న హిందీతో పాటు తెలుగులో.. ఈ నెల 14న, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ రోజు మా 18F మూవీస్ మీడియా ప్రతినిధి తో జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి.
ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ….

లాక్ డౌన్ టైమ్ లో థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఆ తర్వాత థియేటర్స్ అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఆ టైమ్ లో స్క్రిప్ట్ డెవలప్ చేసే దశలో ఉన్నాం. థియేటర్స్ అన్నీ ఓపెన్ అయ్యాక ఈ సినిమాను థియేట్రికల్ గా రిలీజ్ చేయాలని అనుకున్నాం. మేము ఈ ప్రాజెక్ట్ టేకోవర్ చేసినప్పటి నుంచి థియేట్రికల్ గానే వెళ్లేందుకు ప్లాన్ చేశాం. ప్రొడ్యూసర్ గా కమర్షియల్ గా మూవీ ఉండాలని కోరుకుంటాం. కానీ మేము రిస్క్ చేసినా ఫర్వాలేదు అనేంత బాగా ఈ స్టోరీ నచ్చింది.
విద్య గారితో మంచి బాండింగ్ ఉంది. ప్రొడక్షన్ వైజ్ డెసిషన్స్ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. మనం లవ్ స్టోరీస్ ను ఎవరో ఒకరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. ఈ కథ హీరోయిన్ కోణంలో ఉంటుంది. అలాంటప్పుడు స్టార్స్ ను ఈ మూవీకి హీరోగా తీసుకోలేం. పర్ ఫార్మర్స్ నే తీసుకోవాలి. దీక్షిత్ మంచి పర్ ఫార్మర్. రశ్మిక లాగే తన క్యారెక్టర్ లో ఆకట్టుకునేలా నటించాడు. ఈ ఏజ్ గ్రూప్ లో నాకు తెలిసిన వాళ్లలో దీక్షిత్ ఈ మూవీకి పర్పెక్ట్ అనిపించింది. సినిమా చూశాక మీకూ అదే ఫీల్ కలుగుతుంది.
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను మేమే సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. థియేట్రికల్ గా ఈ మూవీ బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నాం. దీక్షిత్ ను తీసుకోవడం వల్ల కన్నడ మార్కెట్ కు ఉపయోగపడుతుందని అనుకోలేదు, ఆ క్యారెక్టర్ కు ఆయన కరెక్ట్ గా సెట్ అవుతాడనే తీసుకున్నాం. అయితే రశ్మిక, దీక్షిత్ ఉండటం వల్ల కన్నడలో అడ్వాంటేజ్ అవుతుంది.
తెలుగులో వస్తున్న పెద్ద సినిమాలను కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలూ ఇలా ట్రై చేస్తున్నా కొన్నిసార్లు టైమ్ సరిపోక కన్నడ వెర్షన్ లో రిలీజ్ చేయడం లేదు. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమాను ఈ నెల 7న హిందీ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. మరో వారం తర్వాత ఈ నెల 14న తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తాం. ముంబైలో ఒక ఈవెంట్ చేయాలనే ప్లాన్ ఉంది.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన ఫస్ట్ మూవీ చి.ల.సౌ ఆ సినిమా బడ్జెట్ కు బాగా వర్కవుట్ అయ్యింది. నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఆయన సెకండ్ మూవీ మన్మథుడు 2 డైనమిక్స్ వేరు. గతంలో రాహుల్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి కాకుండా మేము కథ బాగా నచ్చి ఈ మూవీ ప్రొడ్యూస్ చేశాం. రశ్మిక ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోలేదు కాబట్టి ఆ కృతజ్ఞతతో రెట్టింపు పారితోషికం ఇస్తున్నాం.
అనూ ఇమ్మాన్యుయేల్ మంచి రోల్ చేసింది. తనది గెస్ట్ రోల్ కంటే పెద్ద క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కు ఆమె పర్పెక్ట్ గా కుదిరింది. మామూలుగా సినిమా రిలీజ్ అంటే చివరిదాగా టెన్షన్ పడుతుంటాం. కానీ “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా విషయంలో మేము నమ్మింది స్క్రీన్ మీద కనిపిస్తోంది. సో హ్యాపీగా టెన్షన్ లేకుండా ఉన్నాం. రిలీజ్ కు మంచి డేట్ దొరికింది. రెండు రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు అనేది డేట్స్ అనౌన్స్ చేస్తాం.
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించాలంటే మంచి కంటెంట్ ఉంటేనే సాధ్యమవుతోంది. థియేట్రికల్ గా ఇది బాగుంటుంది అనే స్టోరీస్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. గీతా ఆర్ట్స్, అరవింద్ గారి నుంచి మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాం.

విద్య కొప్పినీడి మాట్లాడుతూ….
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా కథ విన్నప్పుడే మేము స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యాం. ఇది రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ కాదు. ఈ సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక మెసేజ్ ను తీసుకుంటారు. ఇది కమర్షియల్ ఫార్మేట్ స్టోరీ కాకపోయినా రిస్క్ తీసుకోవాలని నేను ధీరజ్ అనుకున్నాం, మా ఇద్దరికీ కథ బాగా నచ్చింది. సెన్సార్ వాళ్ల దగ్గర నుంచి డైరెక్టర్ కు నేషనల్ అవార్డ్ దక్కుతుందనే ప్రశంసలు వచ్చాయి.
ఇద్దరం ప్రొడ్యూసర్స్ కాబట్టి ప్రొడక్షన్ కు సంబంధించిన ఏ వర్క్ అయినా షేర్ చేసుకునే చేశాం. ప్రతి డెసిషన్ కలెక్టివ్ గా డిస్కస్ చేసి తీసుకున్నాం. స్టోరీస్ సెలెక్షన్ విషయంలోనూ ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకుంటాం. మా ప్రాజెక్ట్ వెనక అరవింద్ గారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.
లవ్ స్టోరీస్ చూడటానికి బాగుంటాయి. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేస్తారు. లవ్ స్టోరీస్ లోనే ఏదైనా కొత్తగా ఉండి స్ట్రాంగ్ ఫీల్ ఉంటే అలాంటి సినిమాలు చేయాలని అనుకుంటాం. వుమెన్ సెంట్రిక్ అని కావాలని సెలెక్ట్ చేసుకున్నది కాదు కథ ఆ తరహాలో ఉంటుంది. “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రియల్ ఇన్సిడెంట్స్ తో ఇన్స్ పైర్ అయి రాసినా, మిగతా అంతా స్క్రిప్ట్ చేసుకున్నదే.
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా షూటింగ్ ఎక్కువగా ఒక కాలేజ్ లో చేశాం. వర్కింగ్ డేస్ లో కాలేజ్ లు ఇవ్వరు. అప్పటికి రశ్మిక రెండు మూడు బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటి షూటింగ్ వేరే సిటీస్ లో జరిగేది. దాంతో కొంత డేట్స్ వల్ల డిలే అయ్యింది కానీ మిగతా అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండానే షూటింగ్ చేశాం. సినిమా షూటింగ్ చివరలో ఉండగా కార్మికుల సమ్మె వచ్చింది. సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది కాబట్టి మాకు పెద్దగా ప్రాబ్లమ్ కాలేదు.
సినిమా బిగినింగ్ లోనే హేషమ్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నాం. ఆయన మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ ఉంటాయి. ఇది వుమెన్ సెంట్రిక్ మూవీ కాదు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథ. సినిమా చూసిన ప్రేక్షకులంతా ఈ కథకు రిలేట్ అవుతారు. తమకు తెలిసిన వారి ప్రేమ కథలు వారికి గుర్తొస్తాయి.
ఈ ప్రాజెక్ట్ సమంత గారితో చేయాలని అనుకోలేదు. ఈ స్క్రిప్ట్ కు రశ్మిక గారినే అనుకున్నాం. ఆమెకు ఈ స్క్రిప్ట్ పర్సనల్ గా చాలా నచ్చింది. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఆమెతో ఎలాంటి డిస్కషన్స్ జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తున్నాం. అరవింద్ గారు ఇచ్చే సలహా కూడా అదే.