Pindam Movie Hero Sriram Special Interview: ‘పిండం’ హారర్ సినిమా..థియేటర్ లోనే చూడాల్సిన సిన్మా : హీరో శ్రీరామ్

Pindam Hero Sriram special Interview with 18FMovies 2 Copy e1702545057774

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ రోజు మా 18F మూవీస్ విలేఖరితో ముచ్చటించిన కథానాయకుడు శ్రీరామ్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. అందులోని ముఖ్యమైన విషయాలు మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము.

ఒకరికొకరు సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీ ఆరోగ్య రహస్యం ఏంటి?

 శ్రీరామ్: ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకుంటాను. ఎక్కువగా ఇంటి భోజనం తింటుంటాను. బయటకు వెళ్ళినా ఎక్కువగా పప్పు, సాంబారు వంటి ఆహారమే తీసుకుంటాను. అలాగే ఉన్న దాంతో సంతృప్తి చెంది, ఆనందంగా ఉంటాను.

పిండం సినిమా గురించి చెప్పండి?

Pindam Hero Sriram special Interview with 18FMovies Copy

 శ్రీరామ్:  హారర్ సినిమాల విషయంలో నాకో భయం ఉంటుంది. అదేంటంటే పేరుకి హారర్ సినిమా అంటారు.. కానీ అందులో అనవసరమైన కామెడీ, రొమాన్స్, సాంగ్స్ ను ఇరికిస్తుంటారు. హారర్ జానర్ అంటే హారర్ ఉండాలి. థియేటర్ లో మనం చూసేటప్పుడు ఉలిక్కిపడేలా ఉండాలి. సాయికిరణ్ దైదా పిండం కథ చెప్పగానే నచ్చింది. కొత్త దర్శకుడు అయినప్పటికీ ఆయనకి ఎంతో క్లారిటీ ఉంది. సాయి కిరణ్ తీసిన స్మోక్ అనే షార్ట్ ఫిల్మ్ చూసి ఆయన ప్రతిభపై నమ్మకంగా కలిగింది. ఇన్ని రోజుల్లో, ఇంత బడ్జెట్ లో సినిమా పూర్తి చేస్తామని చెప్పారు. చెప్పినట్లుగానే చేశారు.

నిర్మాత యశ్వంత్ ఈ కథను నమ్మి సినిమా చేశారు. ఆ తర్వాత సినిమాని చూపించి బిజినెస్ చేసుకోగలిగారు. ఇది ఖచ్చితంగా థియేటర్ లో చూసి అనుభూతి చెందాల్సిన అసలైన హారర్ సినిమా. ఈ కథ 1930, 1990, ప్రస్తుతం ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. ఒక ఇల్లు, ఒక కుటుంబం అన్నట్టుగా సినిమా ఉండదు. ఇందులో చాలా కథ ఉంటుంది. పిండం టైటిల్ తో కూడా కథ ముడిపడి ఉంటుంది.

హారర్ సినిమా కదా.. ప్రత్యేకంగా ఏమైనా హోంవర్క్ చేశారా?

Pindam movie poster 4 Copy

 శ్రీరామ్:  ఏ సన్నివేశం చేసే ముందైనా మనం ముందుగా దానిని ఊహించుకోవాలి అని నమ్ముతాను. సంభాషణలను బట్టీ కొట్టి నటించడం నాకు ఇష్టం ఉండదు. సన్నివేశాన్ని అర్థం చేసుకొని, దానిని ఇమాజినేషన్ చేసుకొని.. అప్పుడు నటిస్తాను. దాని వల్ల నటన సహజంగా ఉండి, సన్నివేశం పండుతుంది. నేను దర్శకుల నటుడిని. ఆ సన్నివేశంలో దర్శకుడు ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

హారర్ జానర్ సినిమాలకు రిపీటెడ్ ఆడియెన్స్ ఉండరనే సందేహం కలగలేదా?

 శ్రీరామ్:  అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారు రాత్రి అనే సినిమా తీశారు. నా దృష్టిలో ఇప్పటిదాకా తెలుగులో భయంకరమైన సినిమా అంటే అదే. ఆ సినిమాని ఎన్నో సార్లు చూశాను. పలు ఇంగ్లీష్ హారర్ సినిమాలు కూడా ఎన్నోసార్లు చూశాను. పిండం అనేది కేవలం హారర్ సినిమా కాదు. ఇందులో బలమైన కథ ఉంటుంది. హార్రర్ సన్నివేశాల ఉండటమే కాకుండా.. ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది సినిమా.

నేను కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో చూడాలని ఎదురు చూస్తున్నాను. టీమ్ అందరూ ఎంతో ఇష్టంగా పని చేసి, మంచి అవుట్ పుట్ ఇచ్చారు. మనం మంచి సినిమా తీస్తే, ప్రేక్షకులే తమ వాళ్ళని తీసుకొని మళ్ళీ సినిమాకి వెళ్తారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది.

Pindam movie poster Copy

పిండం టైటిల్ గురించి?

 శ్రీరామ్:  కొందరు దీనిని నెగటివ్ టైటిల్ అంటున్నారు. పిండం అనేది నెగటివ్ టైటిల్ కాదు.. పాజిటివ్ టైటిల్. పుట్టుకలోనూ, చావులోనూ పిండం ఉంటుంది. తల్లి కడుపులో పెరిగే బిడ్డను పిండం అంటారు. అలాగే మనిషి చనిపోయాక వారి ఆత్మశాంతి కోసం పెట్టే భోజనాన్ని పిండం అంటారు. ఒకటి జీవితాన్ని ఇస్తుంది. ఇంకొకటి మరణం తర్వాత కూడా ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఇది పాజిటివ్ టైటిల్. పైగా ఇది కథకి సరిగ్గా సరిపోయే టైటిల్.

మీరు కూడా గతంలో హారర్ సినిమాలు చేశారు.. వాటితో పోలిస్తే పిండం కొత్తగా ఉండబోతుందా?

 శ్రీరామ్:  మిగతా సినిమాలతో పోలిస్తే పిండం వైవిధ్యంగా ఉంటుంది. ఇది కొన్ని కుటుంబాల ప్రయాణం. ఇది కేవలం హారర్ మాత్రమే కాదు.. ఇదొక ఎమోషనల్ డ్రామా. ప్రతి పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది.

Pindam movie poster 9 Copy

శ్రీనివాస్ అవసరాల గారు, ఈశ్వరీరావు గారి గురించి?

 శ్రీరామ్:  శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్ లో నాకు సన్నివేశాలు లేవు. ఇది మూడు కాలాల్లో జరిగే కథ కదా. ఆయన వేరే టైం పీరియడ్ లో ఉంటారు. అయితే ఆయన నటించిన కొన్ని సన్నివేశాలను చూశాను. అద్భుతంగా నటించారు. ఇక ఈశ్వరీరావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకసారి సన్నివేశం చిత్రీకరణ సమయంలో ఆమె తలకి గాయమైంది. ఆలస్యమైతే గాయం వాచిపోయి, షూటింగ్ కి ఇబ్బంది అవుతుందని..

వేగంగా ఆమె సన్నివేశాలను పూర్తి చేసుకొని ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళారు. తన వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఆమె నిబద్ధతతో పని చేశారు. మిగతా నటీనటులు కూడా ఎంతో ఇష్టంగా పని చేశారు. చిన్న పిల్లలు కూడా అద్భుతంగా నటించారు. ఖుషీ రవి గారు అలా వచ్చి నిల్చుంటే చాలు పాత్రలో లేనమైనట్టు కనిపిస్తారు.

మీరు సినిమా లు చేస్తున్నారు, ఓటీటీ కూడా నటిస్తున్నారు. ఓటీటీ గురించి మీ అభిప్రాయం ?

Pindam Hero Sriram special Interview with 18FMovies 1 Copy

 శ్రీరామ్:  ఓటీటీ అనేది మన ప్రతిభను చూపించుకోవడానికి మరో వేదిక. అక్కడా ఎన్నో విభిన్న కంటెంట్ లు వస్తున్నాయి. నేను చేసిన రెక్కీ నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. అలాగే ప్రస్తుతం ఓటీటీ కోసం నెట్ వర్క్, హరికథ అనే ప్రాజెక్ట్ లు చేస్తున్నాను.

తదుపరి సినిమాలు?

 శ్రీరామ్:  నేను, జి.వి. ప్రకాష్ కలిసి తమిళ్ లో బ్లాక్ మెయిల్ అనే మూవీ చేస్తున్నాం. అలాగే సంభవం అనే ఇంకో సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *